హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10:
న్యాయవ్యవస్థలో బహుజన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ లాయర్స్ అసోసియేషన్ తీర్మానించింది. న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు బలోపేతం కావాలంటే న్యాయమూర్తుల నియామకాలతో సహా అన్ని కీలక వ్యవస్థల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా బహుజన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం ‘ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అనే అంశంపై బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు తలకొక్కుల రాజు అధ్యక్షతన, కార్యదర్శి పొన్నం దేవరాజ్ గౌడ్ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని న్యాయవ్యవస్థలో సామాజిక ప్రాతినిధ్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
న్యాయవ్యవస్థలో సమాన అవకాశాలకు ప్రాధాన్యం*
సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం అందించే వ్యవస్థలోనే అన్ని సామాజిక వర్గాలకు తగిన భాగస్వామ్యం ఉండాలని వక్తలు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో బహుజన వర్గాల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. అర్హత కలిగిన బహుజన న్యాయవాదులకు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కొలీజియం వ్యవస్థపై పునరాలోచన అవసరం*
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థపై పునరాలోచన జరగాలని సదస్సు అభిప్రాయపడింది. నియామకాల ప్రక్రియలో పారదర్శకత, సమాన అవకాశాలు, సామాజిక ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం కల్పించే విధానాలను పరిశీలించాలని కోరింది. న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా విధానపరమైన మార్పుల కోసం కృషి చేయాలని నిర్ణయించింది.
బహుజన న్యాయవాదుల చైతన్యానికి కార్యాచరణ*
న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం సాధించేందుకు స్వల్పకాలిక వ్యూహాలు, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగాలని బీసీ లాయర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. బహుజన న్యాయవాదుల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు, వారి సమస్యలు మరియు ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాలపై సంఘటితంగా కృషి చేసేందుకు సమగ్రమైన కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటించింది. అవసరమైతే తమ డిమాండ్ల సాధన కోసం కార్యాచరణను మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేసింది.
ప్రముఖుల భాగస్వామ్యం*
ఈ సదస్సులో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, బార్ కౌన్సిల్ సభ్యులు రఘునాథ్, సునీల్ గౌడ్, ముఖిద్, బీసీ మేధావులు పి. వినయ్ కుమార్, నారగోని, బొమ్మగాని ప్రభాకర్, చిక్కుడు ప్రభాకర్, మాస్టర్ జి. రంగయ్య, నల్లమాస కృష్ణ, చామకూర రాజు, కోల జనార్ధన్, మంజుల దేవి తదితరులు పాల్గొన్నారు.





