Sunday11 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు రూ.5 లక్షల నిధులు

• పట్టణాలు, గ్రామాల సమగ్ర అభివృద్ధే నా బాధ్యత – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి • ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలి • వచ్చే వర్షాకాలం వరకు సాగర్ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి • రబీలో తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రైతులకు సూచన

nagendra11 October 2026, 1:23 AM0 viewstrinetnews.com
హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు రూ.5 లక్షల నిధులు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10:

హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధికి రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపల్ పాలకవర్గాల సభ్యులు , ముఖ్య నాయకులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల అభివృద్ధి, వార్డుల వారీగా ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, సాగునీటి పరిస్థితులు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ, ప్రతి వార్డులో అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల అంతర్గత నిధుల కేటాయింపులో పరిమితులు ఉన్నప్పటికీ, అభివృద్ధి పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారకుండా కృషి చేస్తానన్నారు.

ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నా

రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో పనిచేసే అవకాశం తనకు లభించిందని, ఆ బాధ్యతలకు తగిన విధంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతటి బాధ్యతల్లో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండేది తానేనని స్పష్టం చేశారు.

వరుసగా ఏడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పటికీ హైదరాబాద్‌లో అద్దె ఇంట్లోనే నివసిస్తున్నానని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాసేవకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు.

తనకున్న సమయాన్ని పూర్తిగా ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, తనకు అప్పగించిన శాఖల సమర్థ నిర్వహణ కోసం వినియోగిస్తున్నానన్నారు. ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసమే తపిస్తున్నానని చెప్పారు.

ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి

మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను సమర్థంగా నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

Also read