హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ అక్టోబర్ 9 :
ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షపాతం లోటు పరిస్థితులను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి, కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం అనంతరం సచివాలయం నుంచి రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో వీడియో సమావేశం నిర్వహిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు తెలిపారు. ఈ సమావేశంలో రైతు వేదికల ద్వారా రైతులు పాల్గొంటారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని కలెక్టర్లకు సూచించారు.
వర్షపాతం లోటు కారణంగా పరిస్థితి, వచ్చే ఏడాది మధ్యకాలం వరకు కొనసాగే అవకాశం ఉందని సిఎస్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావాల నుంచి రైతులను కాపాడేందుకు పంటల వైవిధ్యీకరణ, ముందస్తు ప్రణాళికలు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.
కరువు మార్గదర్శకాలను అధ్యయనం చేసి, జిల్లాల్లో కరువు ప్రభావిత మండలాలను గుర్తిస్తూ ప్రాథమిక నివేదికలు సమర్పించాలని ప్రభుత్వ ఆయన కలెక్టర్లను ఆదేశించారు. గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఉత్పాదకతను పెంచే, దీర్ఘకాలం ఉపయోగపడే ఆస్తుల నిర్మాణానికి VBGRAMG నిధులను వినియోగించుకోవాలని సూచించారు. కరువు తరహా పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిధుల కొరత ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కరువు ప్రకటనకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ కలెక్టర్లకు తెలిపారు. ప్రాథమిక నివేదికలు సమర్పించే సమయంలో వర్షపాతం గణాంకాలు, పంటల సాగు విస్తీర్ణం, నేలలో తేమ పరిస్థితులు, జలవనరులకు సంబంధించిన గణాంకాలు, జలాశయాల్లో నీటి నిల్వల స్థాయులు, వాగులు, ప్రవాహాల పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయాలని ఆయన సూచించారు. వీబీజీ రామ్ జీ కింద వేతన ఉపాధి కల్పనపై పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ కలెక్టర్లకు వివరించారు. అధిక సంఖ్యలో కూలీలకు ఉపాధి కల్పించే పనులను విస్తృతంగా చేపట్టాలని ఆమె సూచించారు. చెరువులు, పొలాల కాలువల్లో పూడికతీత, గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి, కందకాల తవ్వకం, వివిధ నీటి సంరక్షణ పనులను చేపట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. మ్యాజిక్ సోక్ పిట్లు, వ్యవసాయ కుంటలు, ఇంకుడు చెరువులు, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాల ఏర్పాటు వంటి పనులను కూడా ఆమె ప్రస్తావించారు. ఈ పనుల ద్వారా నీటి సంరక్షణకు, భూగర్భ జలాల పునరుద్ధరణకు దోహదపడటంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించవచ్చని తెలిపారు.రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్లకు వివరించారు. జిల్లాల్లో విద్యుత్ సరఫరా, సంబంధిత సమస్యలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రాష్ట్రంలో వర్షపాత పరిస్థితులపై సమగ్ర వివరాలను అందించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రబీ సీజన్‌కు సంబంధించిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. తగిన ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సమాచార, పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.





