హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ , అక్టోబర్ 9:
తెలంగాణ టూరిజం పాలసీ 2025–30లో భాగంగా మెడికల్ వెల్నెస్ టూరిజం అభివృద్ధికి సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ వెల్నెస్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. తెలంగాణలో మెడికల్ టూరిజం అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటం రాష్ట్రానికి అనుకూలమైన అంశాలని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను మెడికల్ టూరిజం గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు వివరాలను వెల్లడిస్తూ, హైదరాబాద్‌లో 89 నాబ్ గుర్తింపు పొందిన ఆసుపత్రులు, 8 జేసీఐ గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా దేశాలు సహా వివిధ దేశాల నుంచి వైద్య చికిత్సల కోసం రోగులు హైదరాబాద్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సాంకేతికత, ఆధునిక పరికరాలు, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్ల అంతర్జాతీయ టూరిస్టులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందని వివరించారు.
మెడికల్ టూరిజం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ ప్రచారం, సేవల సమన్వయం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సి.ఎస్ సూచించారు. ఈ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇన్వెస్ట్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ప్రోత్సహించాలని, అవసరమైన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను (DPRs) తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు.
వైద్య సేవలను సులభతరం చేసేందుకు వివిధ శాఖలు, ఆసుపత్రులు, సంబంధిత సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించాలని, మెడికల్ టూరిజం సేవల కోసం సింగిల్ విండో పోర్టల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వైద్య సంప్రదింపులు, చికిత్స, ఆసుపత్రి సేవలు, అవసరమైన ఇతర సదుపాయాలు సులభంగా అందేలా వ్యవస్థలను రూపొందించాలని సూచించారు.
అలాగే అవయవ మార్పిడి చికిత్సలకు సంబంధించిన ప్రక్రియలను నిబంధనలకు అనుగుణంగా మరింత క్రమబద్ధీకరించేందుకు, సంబంధిత అనుమతులు, సమన్వయం, సేవల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తెలంగాణను అంతర్జాతీయ స్థాయి మెడికల్ వెల్నెస్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముందే ప్రాధాన్యతా ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రతిపాదనలు, అమలు ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఈ సమావేశంలో యూత్ సర్వీస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్త పట్నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.





