• కూరగాయల సాగును పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి
• ఆయిల్ పామ్ అంతరపంటగా కోకో సాగుచేసే రైతుల సౌకర్యం కోసం కోకో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
• ఆయిల్ ఫెడ్‌లో నియామకాలను వెంటనే పూర్తి చేయాలి
• వ్యవసాయ మరియు ఉద్యానశాఖలో అమలు చేస్తున్న వ్యవసాయయాంత్రీకరణ పథకాన్ని ఏకీకృత నోడల్ ఏజెన్సీ ద్వారా అమలుకు ఆదేశాలు
• అధికారులతో సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,
అక్టోబర్ 9: ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ, ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఉద్యాన పంటల పథకాల అమలు, ఆయిల్ పామ్ సాగు పురోగతి తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగడం శుభపరిణామం...*
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండటం సానుకూల పరిణామమని మంత్రి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే స్పైసెస్ సాగు 65 శాతం, ఎర్రమిరప సాగు 83 శాతం, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు 192 శాతం, పూల సాగు 198 శాతం పెరిగినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉద్యాన పంటల సాగులో నమోదవుతున్న ఈ పురోగతిని కొనసాగించడంతో పాటు మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
కూరగాయల సాగును పెంచాలి.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలి
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని కూడా గణనీయంగా పెంచాలని మంత్రి సూచించారు. కూరగాయల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, ఉత్పత్తి పెంపుతో పాటు మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. తెలంగాణలో పండించిన కూరగాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని, ఆ దిశగా ఉద్యాన శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం...
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు అనుకూలత ఉందని, కనీసం 10 లక్షల ఎకరాల్లోనైనా సాగు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే లక్ష్యంతో అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఆయిల్ పామ్ గెలల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి, డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన మొక్కలను సరఫరా చేసేందుకు నర్సరీల్లో ముందుగానే మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మొక్కల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా, రైతులకు అవసరమైన సమయంలో మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి...
ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అనుగుణంగా ప్రాసెసింగ్ సదుపాయాలను కూడా పెంచాలని మంత్రి తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను సంక్రాంతి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగులో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించని కంపెనీలకు కేటాయించిన జిల్లాల రద్దు చేసేందుకు వెనుకాడవద్దని మంత్రి స్పష్టం చేశారు. కేటాయించిన లక్ష్యాలను సాధించడంలో కంపెనీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ అంతరపంటగా కోకో సాగుకు ప్రోత్సాహం...*
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ తోటల్లో అంతరపంటగా కోకో సాగు చేస్తూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోకో పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతుల్లో సాగుపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తొలిదశలో అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో కోకో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఏకీకృత నోడల్ ఏజెన్సీ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ అమలు...
వ్యవసాయ మరియు ఉద్యానశాఖలో అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వేరువేరుగా కాకుండా ఏకీకృత నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆయిల్ ఫెడ్‌లో నియామకాలను వేగవంతం చేయాలి...
ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్ ఫెడ్‌లో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి, అక్టోబర్ నెలాఖరులోగా నియామకాలకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. తదుపరి రెండు, మూడు నెలల్లో నియామక
ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్రమోహన్, ఉద్యాన శాఖ ఎం.డీ, ఆయిల్ ఫెడ్ ఎం.డీ శ్రీమతి యాస్మిన్ బాషా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.





