తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా సమ్మిట్
గ్లోబల్ సమ్మిట్‌పై అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు
.హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:
డిసెంబర్ 7, 8, 9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0 కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌ను శుక్రవారం ఆయన సందర్శించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. శాఖల మధ్య నిరంతర సమాచార మార్పిడి, సమన్వయం ఉండేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమ్మిట్ విజయవంతానికి ప్రతి శాఖ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి అధికారి సమష్టి బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, ప్లానింగ్ ముఖ్య కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.





