వ్యవసాయం, వైద్యం, విద్యలో కృత్రిమ మేధ వినియోగ విస్తరణపై చర్చ
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 8, ట్రైనెట్ న్యూస్:
కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలు దేశంలోని ప్రతి పౌరుడికీ, వ్యాపార సంస్థలకూ చేరేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక, రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. న్యూ ఢిల్లీలోని ది ఒబెరాయ్ హోటల్‌లో గురువారం ప్రపంచ బ్యాంకు గ్రూపు రూపొందించిన ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్–2026: ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను ఆయన ఆవిష్కరించారు.
ఇండియాఏఐ మిషన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ప్రపంచ బ్యాంకు గ్రూపు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విధాన రూపకర్తలు, అభివృద్ధి నిపుణులు, సాంకేతిక రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏఐని స్వీకరించడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా మలచుకోవడం, అనంతరం మరింత అభివృద్ధి చేయడం అనే మూడు దశల విధానాన్ని నివేదిక ప్రతిపాదించింది.
ఏఐ సామాన్యుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొస్తోందని వైష్ణవ్ పేర్కొన్నారు. బారామతిలో ఏఐ ఆధారిత వ్యవసాయ పద్ధతులతో చెరకు దిగుబడి 40 శాతం పెరగగా, నీరు, ఎరువుల వినియోగం 30 శాతం తగ్గిందని తెలిపారు. కంప్యూటర్ వినియోగించని రైతులు కూడా ఫోన్‌లో వాయిస్ సేవల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఉపగ్రహాలు, ఐఓటీ పరికరాలు, వాతావరణ సమాచారాన్ని ఉపయోగించే ఈ విధానంతో కూలీల వ్యయం కూడా తగ్గిందన్నారు.
వైద్య రంగంలో క్షయవ్యాధి గుర్తింపు 35 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు. గుజరాత్‌లో ఐదు లక్షల మంది రైతులు అగ్రిస్టాక్‌ను ఉపయోగిస్తున్నారని, ‘సర్లాబెన్’ ద్వారా అందిస్తున్న ఏఐ ఆధారిత పశు ఆరోగ్య సేవలు మూడు కోట్ల పశువులకు, వాటి యజమానులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని వివరించారు.
ఏఐ ద్వారా నిపుణుల సేవలను మరింత మందికి చేరవేయవచ్చని, ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ప్రయోజనాలను సాధించేందుకు నిరంతర విద్యుత్, విశ్వసనీయ ఇంటర్నెట్ అనుసంధానం, కంప్యూటింగ్ మౌలిక వసతులు, నాణ్యమైన డేటా, నైపుణ్యాలు, సమర్థ విద్యా వ్యవస్థలు, సంస్థలు అవసరమని స్పష్టం చేసింది.
ఇండియాఏఐ మిషన్ కింద కంప్యూటింగ్ సామర్థ్యం, స్వదేశీ ప్రాథమిక ఏఐ నమూనాలు, ఏఐకోశ్ డేటాసెట్ల వేదిక, అనువర్తనాల అభివృద్ధి, భవిష్యత్ నైపుణ్యాలు, స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం, సురక్షిత–విశ్వసనీయ ఏఐ అనే ఏడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. భారత భాషలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను రూపొందించడంతో పాటు గోప్యత పరిరక్షణ, ఏఐ పక్షపాత నివారణ, అల్గోరిథమ్‌ల తనిఖీ, డీప్‌ఫేక్‌ల గుర్తింపునకు స్వదేశీ సాధనాలను ప్రోత్సహిస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి డాక్టర్ సోమిక్ లాల్ మాట్లాడుతూ ఏఐని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల అవసరాలకు సమర్థంగా వినియోగించడం కీలకమని అన్నారు. సంస్థలు, మార్కెట్లు, ఏఐని అనుసంధానించి కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం భారత్‌కు ఉందన్నారు.
ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త, సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మైఖేల్ క్రెమర్ మాట్లాడుతూ భారత్‌లో ఏఐ పురోగతి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైతులకు వాతావరణ సూచనలు, ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సాంకేతిక పరిష్కారాలను ఉదాహరణలుగా ప్రస్తావించారు. ఏఐ సేవలను విస్తరించేందుకు సాఫ్ట్‌వేర్‌తో పాటు మానవ వనరులు, సంస్థాగత సామర్థ్యాలు అవసరమని వివరించారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులోని ఏఐ సాధనాలను మలచుకోవాలని నివేదిక డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ నయ్యర్ సూచించారు. అత్యాధునిక వ్యవస్థలను మొదటి నుంచి నిర్మించేందుకు భారీగా ఖర్చు చేయడంకంటే, అవసరాలకు తగిన పరిష్కారాలను వ్యయపరంగా సమర్థంగా ఎంచుకోవాలని పేర్కొన్నారు.
మానవ నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ‘ఏఐ టాలెంట్ మిషన్’పై కృషి జరుగుతోందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. దేశీయ వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగం మరింత పెరగాలని, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విధానాలు సరళంగా ఉండాలని అన్నారు.
కార్యక్రమంలో నిర్వహించిన రాష్ట్రాల ఏఐ ఆవిష్కరణల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘నవచేతన’ను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. సున్నా నుంచి ఆరేళ్ల పిల్లల్లో అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఏఐని వినియోగిస్తోంది. మహారాష్ట్ర రైతుల సలహాల వేదిక ‘మహావిస్తార్ ఏఐ’, మేఘాలయ విద్యా పరిపాలన పరిష్కారం ‘ఎడ్‌స్క్‌గ్రిడ్’, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ సాధనం ‘వ్యుహా–సెర్విఏఐ’లను కూడా ప్రదర్శించారు.
విడివిడిగా నిర్వహించే ప్రయోగాల నుంచి, నిరూపిత ఫలితాల ఆధారంగా విస్తృత అమలుకు ముందుకు సాగాలని ఉన్నతస్థాయి చర్చలో నిపుణులు సూచించారు. ఏఐ ప్రయోజనాలు అన్ని వర్గాలకు చేరేలా చూడటం, స్థానిక సామర్థ్యాలను పెంచడం, ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడం, ప్రమాదాలను నియంత్రించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండియాఏఐ మిషన్ డైరెక్టర్ మహ్మద్ వై. సఫీరుల్లా కె. ముగింపు ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది.





