న్యూ ఢిల్లీ, టైనెట్ న్యూస్, అక్టోబర్ 08:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గోదావరి పుష్కరాలు, దక్షిణాది నదుల అనుసంధానం సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించారంటూ, ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని చూపారని, క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి సేవలు అందించారని ప్రశంసించారు.
దూరదృష్టి, స్పష్టమైన లక్ష్యం, దృఢమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పాలనతో భారత్‌ను ప్రపంచ శక్తిగా మలిచారని ప్రధానిని కీర్తించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో భారత దేశ గమనాన్ని మార్చారని ప్రధానితో చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ గౌరవాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేలా తోడ్పడ్డారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజల తరఫున ప్రధానికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.





