హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 8: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్–2 కోసం ఎబిక్స్ గ్రూప్ మద్దతుతో, నటులు రణదీప్ హుడా, లిన్ లైష్రామ్ సహ యాజమాన్యంలో ఉన్న ప్రిత్విరాజ్ యోధాస్ ఎనిమిది మంది సభ్యుల జట్టును ప్రకటించింది. గురువారం ట్యాంక్‌బండ్‌లోని మారియట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో జట్టు వివరాలను వెల్లడించారు.
జట్టులో ప్రపంచ నంబర్–1 కాంపౌండ్ ఆర్చర్ ఆండ్రియా బెసెర్రా, నంబర్–3 రికర్వ్ ఆర్చర్ మాటియాస్ గ్రాండేతో పాటు అభిషేక్ వర్మ, కీర్తి శర్మ, తిరుమూరు గణేష్ మణి రత్నం, గాథా ఆనంద్రావ్ ఖడకే, రాజ్ కౌర్, జుయెల్ సర్కార్ ఉన్నారు. కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో పురుషులు, మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు.
టైటిల్ లక్ష్యంగా బరిలోకి గత సీజన్‌లో తృటిలో టైటిల్‌ను చేజార్చుకున్నామని, ఈసారి బలమైన భారతీయ, అంతర్జాతీయ ఆర్చర్లతో జట్టును సిద్ధం చేశామని రణదీప్ హుడా, లిన్ లైష్రామ్ తెలిపారు. ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యమన్నారు.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 8 నుంచి 18 వరకు ఏపీఎల్ సీజన్–2 పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఆరు ఫ్రాంచైజీలకు చెందిన 48 మంది ఆర్చర్లు పాల్గొంటారని వెల్లడించారు. టాప్–4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకోగా, ఈ నెల 18న ఫైనల్ జరగనుందని తెలిపారు.





