గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,875/10g-0.17%
భాషలు

తాజా వార్తలు

సుపరిపాలనకు పారదర్శకత, జవాబుదారీతనం కీలకం అంతర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సభలో హరివంశ్‌ పిలుపు

nagendra8 October 2026, 12:35 PM0 చూసులుtrinetnews.com
సుపరిపాలనకు పారదర్శకత, జవాబుదారీతనం కీలకం అంతర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సభలో హరివంశ్‌ పిలుపు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హిమాలయ ప్రాంత విపత్తులపై అత్యవసర చర్చకు ఆమోదం

న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ట్రైనెట్ న్యూస్):

సుపరిపాలనను బలోపేతం చేసేందుకు పార్లమెంటు సభ్యులు పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ పిలుపునిచ్చారు. టాంజానియాలోని అరూషాలో జరుగుతున్న 153వ అంతర్‌ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపీయూ) సభ మూడో రోజు అక్టోబరు 7న ఆయన నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం వివిధ సమావేశాల్లో పాల్గొంది.

అందరినీ భాగస్వాములను చేయడం, విశ్వాసం పెంపొందించడం, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సుపరిపాలనను మెరుగుపరచడం, సమాజాలకు సాధికారత చేకూర్చడం అనే అంశంపై జరిగిన సాధారణ చర్చలో హరివంశ్‌ ప్రసంగించారు.

వివిధ అంశాలపై చర్చల్లో భారత ఎంపీలు

డిజిటల్‌ వినియోగ భారం, ఆర్థిక ఒత్తిళ్లు, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో తరాల మధ్య మానసిక ఆరోగ్య సమస్యలపై నిర్వహించిన కార్యశాలలో లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ సంజయ్‌ జైస్వాల్‌ పాల్గొన్నారు. సంస్కరించిన ఐక్యరాజ్యసమితి వ్యవస్థకు ప్రతిబింబంగా టాంజానియాలోని ఐరాస బృందం పాత్రపై జరిగిన చర్చలో అపరాజిత సారంగి పాల్గొన్నారు.

బిజులి కలితా మేధి విజ్ఞాన, సాంకేతిక కార్యబృంద సమావేశానికి హాజరయ్యారు. పర్వతాలు, సముద్రాల జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడం, 2030 నాటికి 30 శాతం సంరక్షణ లక్ష్యాన్ని సాధించడంలో పార్లమెంటరీ నాయకత్వంపై సుస్థిర అభివృద్ధి స్థాయీ సంఘంలో జరిగిన చర్చలోనూ పాల్గొన్నారు.

అంతర్జాతీయ మానవతా చట్టం, మానవ హక్కుల చట్టం అమలులో పార్లమెంటుల పాత్రపై జరిగిన చర్చలో కమల్‌జీత్‌ సెహ్రావత్‌ పాల్గొన్నారు. బాలల హక్కులకు తోడ్పడే నైతిక కృత్రిమ మేధపై కార్యశాలకు, అంతర్జాతీయ మానవతా చట్టం పట్ల గౌరవాన్ని ప్రోత్సహించే కమిటీ సమావేశానికి కూడా హాజరయ్యారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంపై నిర్వహించిన కార్యశాలలో డాక్టర్‌ లతా వాంఖెడే పాల్గొన్నారు.

ఘర్షణల సమయంలో సముద్ర భద్రత, కీలక మౌలిక వసతుల పరిరక్షణ, అంతర్జాతీయ నౌకాయానం, ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంలో పార్లమెంటుల పాత్రపై నిపుణులతో నిర్వహించిన చర్చలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ సస్మిత్‌ పాత్ర పాల్గొన్నారు.

రష్యా ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశం

హరివంశ్‌ నేతృత్వంలోని భారత బృందం రష్యా పార్లమెంటు సమాఖ్య మండలి డిప్యూటీ చైర్మన్‌ కాన్‌స్టాంటిన్‌ కొసాచెవ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించింది. పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించింది.

పదవీకాలం ముగియనున్న ఐపీయూ అధ్యక్షురాలు తులియా అక్సన్‌ను హరివంశ్‌ కలిశారు. ఐపీయూ కార్యకలాపాలను మరింత సమ్మిళితంగా, చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఆమె చేసిన కృషిని అభినందించారు. వివిధ దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విస్తరించేందుకు చేపట్టిన చర్యలను ప్రశంసించారు.

ఐపీయూ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన ఆండా ఫిలిప్‌ను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కలిశారు. ఐపీయూ 137 ఏళ్ల చరిత్రలో ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళ ఆమె. ప్రజాస్వామ్యం, శాంతి ప్రోత్సాహానికి ఐపీయూ చేస్తున్న కృషికి భారత పార్లమెంటు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

నేపాల్‌ ప్రతిపాదనకు భారత్‌ మద్దతు

సభ ఎజెండాలో అత్యవసర అంశాన్ని చేర్చేందుకు జరిగిన ఓటింగ్‌లో భారత ప్రతినిధి బృందం పాల్గొంది. హిమాలయ ప్రాంతంతోపాటు ఇతర దుర్బల ప్రాంతాల్లో వాతావరణ సంబంధిత విపత్తులను ఎదుర్కోవడం, వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం అత్యవసర పార్లమెంటరీ చర్యలు చేపట్టాలన్న నేపాల్‌ ప్రతిపాదనకు భారత్‌ సహా పలు దేశాలు మద్దతు తెలిపాయి. ఓటింగ్‌ అనంతరం ఈ ప్రతిపాదనను 153వ ఐపీయూ సభ అత్యవసర అంశంగా ఆమోదించినట్లు అధ్యక్షురాలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →