ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:17 pm

బుధవారం

16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:17 pm

SENSEX74,366-0.72%
NIFTY23,257-0.94%
హైదరాబాద్ 22K₹1,43,751/10g-0.99%
హైదరాబాద్ 24K₹1,56,819/10g-0.99%
వెండి₹2,16,812/kg+0.85%

తాజా వార్తలు

విశ్వమును ఎవరు సృష్టించారు? ప్రళయం అనగా నేమి? ఔను ఈ విశ్వాన్ని ఎవరు సృజించారు.? ఈ విశ్వాన్ని సృజించక పూర్వం ఏముండేది? ఏదైనా పదార్థం ఉన్నదా లేదా? సృష్టికి పూర్వం ఎలా ఉండేదో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చూసి ఉంటారు?

nagendra16 September 2026, 2:11 AM0 చూసులుtrinetnews.com
విశ్వమును ఎవరు సృష్టించారు? ప్రళయం అనగా నేమి?  ఔను ఈ విశ్వాన్ని ఎవరు సృజించారు.? ఈ విశ్వాన్ని సృజించక పూర్వం ఏముండేది? ఏదైనా పదార్థం ఉన్నదా లేదా? సృష్టికి పూర్వం ఎలా ఉండేదో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చూసి ఉంటారు?

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

విశ్వమును ఎవరు సృష్టించారు? ప్రళయం అనగా నేమి?

ఔను ఈ విశ్వాన్ని ఎవరు సృజించారు.? ఈ విశ్వాన్ని సృజించక పూర్వం ఏముండేది? ఏదైనా పదార్థం ఉన్నదా లేదా? సృష్టికి పూర్వం ఎలా ఉండేదో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చూసి ఉంటారు?

ఆ విషయం మనకు ఇప్పుడు ఎవరు చెబుతారు? ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఏమీ లేకపోతే అప్పుడెలా ఉండేది?

సృష్టిని గురించి, సృష్టించిన భగవంతుని గురించి తెలుసుకునే వారికి ఎవరికైనా ఈ విధమైన ప్రశ్నలు సందేహాలు కలుగుతాయి. ఈ సందేహాలు సామాన్యులకు కలగటం కాదు. వేదాలను దర్శించిన ఋషులకే కలిగినాయి.

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి. అన్నింటికంటే ప్రాచీనమైనవి, భారతీయమైన సనాతన ధర్మాన్ని బోధించే గ్రంథాలు వేదాలు. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం వేదాలనే సంప్రదించాలి.

వేదాలను పరిశీలించగలిగితే, సృష్టిని గురించి ఇప్పుడు మనకు కలిగిన ప్రశ్నలే వేదకాలంనాటి ఋషులకు కలిగినాయని తెలుస్తుంది.

ఇయం విసృష్టిః యత ఆ బభూవ? కుత ఆజాతా?

(ఈ సృష్టి ఎవరి వలన వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది?)

కో దదర్శ? (ఎవరు చూశారు?) కో అద్దా వేత్తి? (ఎవరికి ఆ విషయం తెలుసు?)

క ఇహ ప్రవోచత్? (ఇప్పుడు మనకు ఎవరు చెబుతారు?)

నాసదీయ సూక్తము ఋ 10.129

ఇవే ప్రశ్నలు వేద ఋషులు తాము దర్శించిన మంత్రాలలో వేశారు.

వేదంలోనే ఉన్న ఈ ప్రశ్నలకి సమాధానాలు వేదంలోనే వెతకాలి. అలా పరిశీలిస్తే ఋగ్వేదంలో పదవ మండలంలో 81 మరియు 82 సూక్తాలలో ఉన్న 7+7 = 14 మంత్రాలలో చక్కగా వివరించబడింది.

ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి అంతా ఏదో ఒక నాటికి, అన్ని శక్తులు ఉడిగిపోయి, నశించిపోతుంది. దానిని మనం ప్రళయం అంటాం. ఒక వస్తువు వేరొక వస్తువులో కలిసిపోతే అది లయమైపోవడం. ప్రపంచమంతా లేకుండా అదృశ్యమైపోతుంది. ఎవరు సృష్టించారో వారే సర్వ జగత్తును తనలో లయము చేసుకుంటారు. అలా జరిగే గొప్ప లయమును ప్రళయం (ప్రకృష్టమైన లయము) అంటారు.

యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి

అనే తైత్తిరీయ ఉపనిషత్తు లోని మంత్రాన్ని పోతన మహాకవి పద్యంలో అద్భుతంగా అనువదించారు భాగవతంలో ఎవ్వనిచే జనించు? జగమెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వనియందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు? సర్వము తానయైన వాడెవ్వడు?... అంటూ పోతన ప్రశ్నించాడు.

ఈ జగత్తు పుట్టకముందు పరమాత్మ సృష్టికర్తలోనే లీనమై ఉంటుంది. ఎవ్వనియందు డిందు? తిరిగి సృష్టికర్తలోనికే ప్రళయమై పరమాత్మ గర్భంలో సూక్ష్మ రూపంలో అణగి ఉంటుంది. అనగా ఈ సృష్టి ఏర్పడక పూర్వము ఆయనలోనే లీనమై (కలిసి) ఉంటుంది. ఆయన సృష్టించిన ఈ జగత్తు ప్రళయకాలంలో తిరిగి ఆయనలోనికే వెళ్లి, ఆయన గర్భంలో సూక్ష్మ రూపంలో అణగి(డిందు) ఉంటుంది.

పునః సృష్టి జరిగే వరకూ సృష్టికర్త విశ్వకర్మ హిరణ్యగర్భంలోని జలంలో బీజరూపంలో తేలియాడుతూ ఉంటుంది.

ఋగ్వేదం 10వ మండలం 81 సూక్తంలో మొదటి మంత్రం విశ్వసృష్టిని గురించి ఇలా చెప్పింది.

"య ఇమా విశ్వా భువనాని జుహ్వత్ ఋషిర్హోతా న్యసీదత్ పితానః స ఆశిషా ద్రవిణమిచ్ఛమానః ప్రథమచ్ఛదవరాన్ ఆవివేశ”

ఇది త్రిష్టుప్ ఛందంలో ఉన్న మంత్రం. ఇది ఋక్. అనగా స్తుతి. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలను ఋక్కులు అంటారు. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు. ఇవి కాల క్రమంలో ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన గ్రంథాలు. సనాతన ధర్మాన్ని బోధించే వేదాలు అత్యంత ప్రాచీనములు. ఒక వైదిక విషయం ఈ గ్రంథాల్లో ఒక్కొక్క దానిలో ఒక్కో విధంగా ఉన్నప్పుడు వేదంలో చెప్పినదానినే ప్రమాణంగా తీసుకోవాలన్నది శాస్త్ర నియమము.

“శ్రుతి స్మృతి విరోధే తు శ్రుతిరేవ గరీయసీ”. వేదంలో ఉన్నదే ప్రమాణం. అదే సత్యం.

ఎవరైతే ప్రళయ కాలంలో, ఒక ఋషి హోమంలో హవిస్సులను వేసినట్లుగా ఈ జగత్తును, విశ్వ సంహార హోమంలో హవిస్సు వలె

లయం చేసుకొన్నాడో, అనగా విశ్వమును తనలో లీనం చేసుకున్నాడో, ఆతడే మరల ఈ జగత్తును సృజించి మనకందరకు తండ్రి అయినాడు. అతడే అందరి హృదయాలలోను ఉన్నాడు. ఆతడే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు.

అతని నేపేరుతో పిలవాలి?

పై మంత్రాలను దర్శించిన భౌవన విశ్వకర్మ ఋషికి కొన్ని సందేహాలు దర్శనమైనాయి.

కిం స్విత్ ఆసీత్ అధిష్ఠానం? ఆ పరమాత్మకు ఆధారపీఠం ఏది? దేని మీద కూర్చొని ఉన్నాడు.

ఆరంభణం కథమత్? స్విత్? ఏ వస్తువు ఆధారంగా ఈ విశ్వ నిర్మాణం ప్రారంభించాడు? అని ప్రశ్నలు వేస్తూ “యతో భూమిం జనయన్ విశ్వకర్మా?” విశ్వకర్మ దేని నుండి ఈ భూమిని పుట్టించాడు? అంటూ దర్శనమైన ప్రశ్నలలోనే “ఈ జగత్తును లయం చేసుకొని, తిరిగి సృష్టించినవాడు విశ్వకర్మ” అని

సృష్టికర్తను విశ్వకర్మ అనే పేరుతో వ్యవహరించాలని ఋగ్వేదం ఈ మంత్రంలో ఉపదేశించి, ఆదేశించింది. వేద మంత్రములు ప్రభు సమ్మితములని ఆర్యోక్తి.

విశ్వకర్మ ఎలా సృష్టించాడు? అనే ప్రశ్నకు “విద్యాం ఔర్ణోత్ మహినా విశ్వచక్షాః" అని సమాధానం దర్శనమైంది.

ఆ విశ్వ చక్షువు , ఆ సర్వ ద్రష్ట , స్వర్గాది లోకాలను , అంతరిక్షాన్ని , భూమిని తన మహిమతోనే సృజించాడు.

ఆ విశ్వకర్మనే “విశ్వచక్షువు” అనే మరో అద్భుతమైన పేరుతో పిలిచింది వేదం.

విశ్వమంతా ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. అనగా ఈ విశ్వంలో జరిగేవి, జరగబోయేవి, జరుగుతున్నవి అన్నీ విశ్వకర్మ మనస్సంకల్పం తోనే జరుగుతాయి.

విశ్వము - కర్మ

మనం చేసే పని కర్మ. కర్మ లేకుండా ప్రాణి లేదు. విశ్వము కర్మోద్భవము. కర్మ అనేది మహత్తరమైనది. ఈ విశ్వము యొక్క నిర్మాణం కూడా ఒక కర్మ. విశ్వ నిర్మాణము, దాని పాలనము, ప్రళయ కాలంలో లయము చేసు కోవడం, అంతర్ధానము చేయడం, మరల అనుగ్రహించడం అనేవి పంచకర్మలు (సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహములు) ఇవన్నీ సృష్టికర్త యొక్క మహత్ పూర్వకమైన కర్మలు. కర్మ లేకుండా విశ్వం లేదు. విశ్వము - కర్మ ఈ రెండు పదాలు పరస్పరాశ్రయములు.

విశ్వ - కర్మ ఈ రెండు పదాల కలయికతో ఏర్పడినదే విశ్వకర్మ అన్న సమాసపదం. సంస్కృతంలో దీన్ని బహువ్రీహి సమాసము అంటారు. విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయాది కర్మలు చేయువాడు ఎవరో అతడు విశ్వకర్మ. విశ్వము దానియొక్క సృష్టి స్థితి లయాది కర్మలు ఎవరివో అతడు విశ్వకర్మ.

విశ్వకర్మ అనగా “సర్వస్య కర్తా” అని యాస్కాచార్యులవారు వేదంలోని పదాలకు అర్థాలను చెబుతూ వ్రాసిన నిరుక్తము అనే నిఘంటువులో వివరించారు.

“యత్ ఇదం కించిత్ భూతం భవిష్యమాణం క్రియమాణంచ సర్వస్య కర్తా." అనగా జరిగిపోయిన సమస్త సృష్టి నిర్మాణ కర్మకు జరుగబోయేది, జరుగుతున్నది అయినా సర్వ జగత్తు యొక్క సర్వకర్మలకు సంకల్ప కర్త విశ్వకర్మ. విశ్వంలో జరిగే సమస్త కర్మలకు కారకుడు విశ్వకర్మ.

"సృష్టి స్థితి లయాదీని సర్వాణి కర్మాణి యస్యః సః విశ్వకర్మా”... అని సాయణాచార్యుల వారి భాష్యం.

“విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్...”

అని ప్రారంభమైన మూడవ మంత్రంలో ఆయన ముఖాలు అనంతము, ఆయన బాహువులు అనంతం, ఆయన పాదాలుఅనంతం, లీలామాత్రమైన పాదాలతో భూమిని, హస్తాలతో ఊర్ధ్వ లోకాలను సృజించి చైతన్యపరచాడు అని ఆయన మహిమ స్తుతించ బడినది అనగా ఆయన సర్వవ్యాపి సర్వాంతర్యామి.

వాచస్పతిః, విశ్వశంభుః

వాచస్పతిం విశ్వకర్మాణమూతయే మనో జువం వాజే అద్యాహువేమ...

81 వ సూక్తం ఏడవ మంత్రంలో విశ్వకర్మ పరమాత్మ ను వాక్కునకు అధిపతియైన వాచస్పతి అని, విశ్వానికి సుఖశాంతులను ప్రసాదించే విశ్వశంభువు(విశ్వశంభుడు)అని కూడ వేదం ప్రస్తుతించింది.

హిరణ్యగర్భుడు అనగా విశ్వకర్మ పరమాత్మయే

“హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ స దాధార పృథివీం ద్యాముతేమాం కస్మై దేవాయ హవిషా విధేమ” ఋ. 10.121.1

సృష్టికి పూర్వము ప్రజాపతి, హిరణ్యగర్భుడు నైన ఏకైక పరమాత్మ విశ్వకర్మ అద్వితీయుడై తానొక్కడే ఉన్నాడు. సర్వభూతములకు కర్త, అధిపతి అయిన హిరణ్యగర్భుడు మాత్రమే ఉన్నాడు. భూలోక స్వర్గలోకాదులను సృజించి ఇచ్చిన, ఆ పరమాత్మకు హవిస్సులను సమర్పించెదము.

హిరణ్యగర్భుడు అనగా అర్ధం ఏమిటి ?

ఈ సృష్టి విశ్వకర్మ లో లయమైపోయినప్పుడు సర్వ జగత్తు ఆయన గర్భమందలి జలములో లీలామాత్రముగా బీజరూపమైన అండముగా తేలియాడుతుంది. అదియే హిరణ్యము. సృష్టి విజ్ఞానము. గొప్ప తేజో భరితము. సృష్టి రహస్య విజ్ఞానమే హిరణ్యము అని వేదార్థము.

హిరణ్య మయమైన గర్భము కలిగిన వాడు హిరణ్యగర్భుడు.

అలా సృష్టికర్త అయిన విశ్వకర్మను హిరణ్యగర్భుడు అను పేరుతో కూడా వేదం ప్రస్తుతించింది.

ఈ విషయం 82 సూక్తంలోని 1, 5 మంత్రాలలో స్పష్టంగా వివరించబడ్డది.

పిత , జనిత , ధాత , విధాత , విహాయా “యో నః పితా జనితా యో విధాతా...."

ఋ. 10.82.3

విశ్వకర్మ జనితా అనగా జన్మకుకారకుడు, తండ్రి. పితా అనగా పాలయిత అని వైదిక అర్థం. తాను సృష్టించుకున్న సంతానాన్ని తానే పోషిస్తాడు కాబట్టి సృష్టికర్తను జనిత, పిత అని, అలాగే విశ్వసృష్టి చేసేవాడు కాబట్టి ధాత. ఆ సృష్టిని ఉంచి రక్షించేవాడు కాబట్టి విధాత.

కల్పాంతమందు విశ్వాన్ని ఉపసంహరించి లయం చేసుకుంటాడు. కాబట్టి విహాయా అనే పేర్లతో సృష్టికర్త విశ్వకర్మను వేదం ప్రస్తుతించింది.

సృష్టికి ముందువెనుకలు!

సృష్టికి ముందు అంతా చీకటి , శూన్యము. శూన్యమనగా ఆకాశమే. ఆ శూన్యంలో ఒక చైతన్యం. ఆ చైతన్యమొక అనంత వెలుగులరాశి , అదొక అగోచరమైన దివ్యశక్తి. ఆకాశాత్మకమైన ఆ దేదీప్య శక్తి రూపరహితము, వాయు-తేజములు నిరాకార దివ్యశక్తి యందు సమ్మిళితములు.

 

సృష్టి జరుగక ముందు పరబ్రహ్మ స్థితి ఎలా ఉన్నదో వర్ణించిన ఏకైక సూక్తం. ఇటువంటి వర్ణన ఏ గ్రంథంలోను లేదు , ఒక్క ఋగ్వేదంలో తప్ప . పాశ్చాత్య పండితులను దిగ్భ్రాంతిపరచిన ఏకైక సూక్తం. నాసదీయ సూక్తము -

ఋ .10-129-1

సకలదేవతలనూ సృష్టించింది... విశ్వకర్మ పరమాత్మయే

ఆది వరాహమూర్తి ... విశ్వకర్మ పరమాత్మ ఇది వేదం ..!

ఆపో వా ఇదమగ్రే సలిలమాసీత్ తస్మిన్ ప్రజాపతి: వాయు: భూత్వా అచరత్

స ఇమామ్ అపశ్యత్ తాం వరాహో భూత్వా అహరత్

తాం విశ్వకర్మా భూత్వా వ్యమార్ట్ సా అప్రథత సా పృథివ్యభవత్

తత్ పృథివ్యై పృథివిత్వం తస్యాo అశ్రామ్యత్ ప్రజాపతిః స దేవాన్ అసృజత

వసూన్ రుద్రాన్ ఆదిత్యాన్ తే దేవాః ప్రజాపతిo అబ్రువన్

ప్రజాయామహా ఇతి సః అబ్రవీత్ యథాహం యుష్మాగ్ం స్తపసాసృక్ష్యేవం తపసి ప్రజన

నమిచ్ఛధ్వమితి తేభ్యోగ్నిమాయతనం ప్రాయచ్ఛత్ (కృష్ణయజుర్వేదం, కాం.7, ప్రపా.1, అధ్యా.5)

సృష్టి మొదట జలరూపముననుండెను. ఆ జలమునందు ప్రజాపతియగు విశ్వకర్మ వాయురూపుడై సంచరించి, జలనిమగ్నయగు భూమిని, శ్వేత వరాహమూర్తి అవతారమెత్తి ఉద్దరించి విస్తరించి పృథ్వినిజేసెను (అందుకే ఈకల్పానికి శ్వేత వరాహ కల్పమని పేరు). పిదప విశ్వకర్మ ప్రజాపతి ... 33 మంది దేవతలను సృష్టించెను. వారే అష్ట వసువులు (  భూమి , ఆకాశం , నీరు ,అగ్ని , వాయు , సూర్య , చంద్ర , నక్షత్ర మండలం = 8 వసువులు) + ఏకాదశరుద్రులు (5 జ్ఞానేంద్రియములు (కళ్లు , చెవులు , ముక్కు ,  నాలుక , చర్మం) + 5 కర్మేంద్రియములు (  నోరు ,  చేతులు , కాళ్లు , మలద్వారం ,జనన అవయవం) + 1 మనస్సు = 11 రుద్రులు ) + ద్వాదశ ఆదిత్యులు (12 మాసములు  చైత్ర , వైశాఖ , జేష్ఠ  , ఆషాడ , శ్రావణ , భాద్రపద , ఆశ్వయుజ , కార్తీక , మార్గశిర , పుష్య , మాఘ ,ఫాల్గుణ = 12 ఆదిత్యులు) + ఇంద్ర + ప్రజాపతి = 33 . పిమ్మట వారికి తపోవ్రతంబునకు ఆధారమగు అగ్నిని ప్రసాదించి హోమమును సృష్టించి, తపంబుసేయుమని సకల దేవతలను ఆదేశించెను.

 

విశ్వకర్మ భూమిని నీటినుండి పైకి తెచ్చినాడను విషయమును అధర్వవేదము నందలి పృథివీ సూక్తములోని మంత్రము కూడా వివరించుచునే యున్నది.

 

"యా మన్వైచ్ఛ ద్ధవిషా విశ్వకర్మా అ న్త రద్దవే రజసి ప్రవిష్టామ్

భుజిష్యం పాత్రం నిహితం గుహా యదావి ర్భోగే అభవన్మాతృ మధ్యః" (అథర్వ వేదం 12-1-60)

నీటియందు మునిగిపోయిన యే భూమిని విశ్వకర్మ అందు మునిగి, వెదికి పైకితెచ్చెనో, తెచ్చి దానిని జీవభోగ్యముగా చేసెనో, ఆభూమి మమ్ము రక్షించు గాక, అనగా మాకు భోగ్యమగుగాక అని భావము. విశ్వకర్మ 'భూసృష్టి' చేసినాడని ఇందలి సారాంశము. ఈ అంశమునే “అద్భ్యః పృథివీ” అన్న ఉపనిషద్వాక్యమును చెప్పుచున్నది.

జలమగ్నమైన భూమిని నీటినుండి విశ్వకర్మ ఉద్దరించినాడని యజుర్వేదమును, అధర్వవేదములోని ఈ మంత్రమును చెప్పుచుండెను . కనుక వసురుద్రాదిత్యుల సృజించినది జగత్కారణుడైన 'విశ్వకర్మయే' అని దీనినిబట్టి స్పష్టమగుచున్నది. అతడు సహస్రాధిక కర్మములనుచేయు విశ్వకర్మ కనుకనే భూమిని సృష్టించినాడు. వసురుద్రాదిత్యులను గూడ సృష్టించినాడనుట ఎఱుగదగిన రహస్యము.

విశ్వకర్మ స్వయంభువు

 

శ్లో॥ నభూమి న జలం చైవ న తేజో నచ వాయువః

నచ బ్రహ్మా నచ విష్ణుశ్చ నచ రుద్రశ్చ తారకా :

సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణ: (మూల స్తంభము).

భావము : పృథివి , జలము , అగ్ని , వాయువు , ఆకాశము , సూర్య , చంద్ర , గ్రహ నక్షత్రాదుల తో కూడిన ఈ విశ్వమేమియు లేనప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాదులేవ్వరూ ఉద్భవించకమునుపు అంతటా ఉన్న మహా శూన్యమున పరిశుద్ధ చైతన్యముగా వ్యాపించి ఏ పరమాత్మ యుండెనో అతడే తనంత తానుగా ఉద్భవించిన వాడు శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మ , అతడే పరమేశ్వరుడు.

వేదము అనగానేమి?

"వేదమనగా జ్ఞానము". వేద శబ్దము "విద్ జ్ఞానే" అనుధాతువు నుండి ఉత్పన్నమైనందున వేద శబ్దమునకు జ్ఞానమని అర్ధము మరియు సత్యం మాత్రమే తెలుపు జ్ఞానమునకే వేదమని పేరు.

విశ్వకర్మ భగవానుడు

ఆయన ఈ చరాచర సృష్టి నిర్మాత. మొదటి యజ్ఞకర్త. ఈ భూమికీ .. మనందరికీ తండ్రి. మనల్ని సృష్టించి మన తలవ్రాతల్ని వ్రాసేవాడూ ఆయనే. మనల్ని పాలించేదీ , ...పోషించేదీ ఆయనే.. కేవలం మనః సంకల్ప మాత్రంగానే సృష్టినీ చేయగలడు. లయమూ చేయగలడు. ఎవరిచే ఈ విశ్వమంతా సృష్టించబడిందో అతడే.. విశ్వకర్మ.

ఇవి వేదం చెప్పిన మాటలు.

ఋగ్వేదం - జగత్ సృష్టికర్త , యజుర్వేదం - తొలి హోత(యజ్ఞకర్త) , సామవేదం - సర్వకార్య సమర్ధుడు ,

అధర్వవేదం - సకల ప్రాణదేవుడు , ఉపనిషత్తులు - అందరి అంతరాత్మ , సర్వ దేవతాత్మకుడు , సకలదేవతార్చితుడు.

విశ్వకర్మా దిశాంపతిః సనః పశూన్ పాతు సః అస్మాన్ పాతు తస్మై నమః

ప్రజాపతి రుద్రో వరుణో గ్ని ర్దిశాంపతి సనః పశూన్ పాతు సోస్మాన్ పాతు తస్మై నమః

(కృష్ణయజుర్వేదం, కాం.5, ప్రపా.5, అను.5)

భావము : సమస్త దిక్కులకూ అధిపతియైన విశ్వకర్మ పరమేశ్వరుడు మమ్ములను రక్షించుగాత.! మా పశువులను రక్షించుగాత!! ఎందుచేతనంటే విశ్వకర్మ భగవానుడే సర్వ వ్యాపకుడు గనుక, ఆయనయే మమ్ములను సర్వదిక్కులనుండి రక్షించగల సమర్థుడు. ఆయనయే సర్వజనకుడు కనుక ఆయనయే దేవ, మానవ, పశు పక్ష్యాది సర్వులను రక్షించగల సమర్థుడు.

 

బ్రహ్మణస్పతి అనగా గణపతి

గణానాం త్వా గణపతిగ్ం హవామహే।

కవిం కవీనా ముపమ శ్రవస్తవమ్ ।

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ॥

ఆనః శ్రుణ్వ న్నూతిభిః సీద సాదనమ్॥ (ఋ - 2.23.1)

గణపతి యనగా గణములకు అధిపతి. గణములనగా రుద్రసంతతి , ప్రమథ గణములు , మరుద్గణములు కావచ్చును. లేదా శిల్పిగణములు కావచ్చును. మరుత్తులు శిల్పులే.అందులో అగ్రగణ్యుడైన గణపతియే బ్రహ్మణస్పతి.

బ్రహ్మణస్పతి యన బ్రహ్మజ్ఞానమున కధిపతి. అతడే బృహస్పతి, వాచస్పతి "వాచస్పతిం విశ్వకర్మాణ మూతయే" (ఋగ్వేద. 10.81.7) తను శ్రుతి ప్రకారము వాచస్పతియు (బ్రహ్మణస్పతి) విశ్వకర్మయు నొక్కరే , కవులకు కవి యైన బ్రహ్మణస్పతియే సమస్త పూజారంభములందు గణపతిగా పూజింపబడుచున్నాడు.

బ్రహ్మణములు అనగా మంత్రములు. వేద మంత్రములకు అధిపతి. ఇది ప్రధాన వైదిక అర్థం

వేద మంత్రములకు అధిపతి అనగా సర్వమంత్రములకు అది దేవత.

సావిత్ర మంత్ర మనకు అది దేవత సవిత.

ఆయా మంత్రములకు అధిపతి అనగా ఆయా మంత్రములచే స్తుతించబడు దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరకు అధిపతి.

గణానాం త్వా గణపతిగ్ం

వసువులు రుద్రులు ఆదిత్యులు ఇత్యాది సమస్తదేవతాగణములకు అధిపతి.

కవిం కవీనాం... కవుల కు కవిని శ్రేష్టులందరకు శ్రేష్టుని.

సర్వ శ్రేష్ఠుని జ్యేష్ఠరాజం సర్వలోకాధిపతిని విశ్వకర్మ పరమాత్మను

శృణ్వన్.. సీద సాదనమ్

మా హవిస్సులను స్వీకరించి, మా మంత్ర పూర్వక ప్రార్థనలను విని మమ్ము కాపాడుటకై

మా యజ్ఞశాలకు ఆహ్వానించుచున్నాను.

“నమో విశ్వకర్మణే" అనే సప్తాక్షరీ మహామంత్రాన్ని కృష్ణ యజుర్వేదం 3.2.8 ఉపదేశించింది.

పంచ బ్రహ్మలు

భగవంతుని శక్తిని చిచ్ఛక్తి అంటాము ప్రజ్ఞానమే దాని రూపం. అది వివిధ శక్తుల రూపాలలో ఈ విశ్వంలో దర్శనమిస్తున్నదని పైన తెలుసుకున్నాము. అలాగే నామరూప రహితుడైన విశ్వబ్రహ్మ విశ్వసృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను ఐదు దైవకార్యాలు నిర్వహించటానికి ఐదు దేవతా రూపములను ధరించెను.

1. శివుడు : అనంతమైన రోదసిని , అగ్నిని సృష్టించాడు. ప్రణవనాదమే ఆయన దేహం ఆదిశక్తి చిచ్ఛక్తియే ఆయన శక్తి (సంహారకర్త)

2. విష్ణువు : అనంతమైన తేజస్సును, వాయువును సృష్టించాడు. పరోరజనీ ఆయన దేహం , పరాశక్తి ఆయన శక్తి (స్థితి కర్త)

3. త్వష్ట బ్రహ్మ : అనంతమైన శబ్దరాశిని, అగ్నిని, గ్రహ, నక్షత్రరాసులను, భూమిని, ప్రాణుల్నీ సృష్టించాడు. ప్రాణాగ్నియే ఆయన దేహం, ఇచ్ఛాశక్తి ఆయన శక్తి, (సృష్టి కర్త)

4. ఇంద్రుడు : అనంతమైన ఆకర్షణ వలయాలను, జలమును సృష్టించాడు విద్యుత్ తేజమే ఆయన దేహం. క్రియా శక్తి ఆయన శక్తి పరిణామ కర్త (తిరోధాన కర్త)

5. అదిత్యుడు : ప్రతి బ్రహ్మాండంలోను ఒక సూర్యుని రూపంలో ఉంటాడు. మనము నివసించే ఈ భూమిని సృష్టించాడు. పరమాణు విద్యుత్తు తేజమే ఆయన దేహం. జ్ఞాన శక్తి ఆయన శక్తి. (అనుగ్రహ కర్త)

 

పైన చెప్పిన బ్రహ్మ స్వరూపాలు ఈ విశ్వం ఉన్నంత వరకూ శాశ్వతమైన సత్య స్వరూపాలు. వారే పంచ బ్రహ్మలు. భగవంతుడు పంచబ్రహ్మ స్వరూపాలలో ఉండి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడని వేదం, పురాణం, ఉపనిషత్తులు స్పష్టంగా చెప్పాయి. మిగిలిన దేవతలందరూ ఉపదేవతలు మాత్రమే.

 

ఈ పంచ బ్రహ్మల తత్వం తెలుసుకొనే ముందు వారిని గూర్చి వేదాలు ఏం చెప్పాయో ఒకసారి అవలోకించవచ్చు. పరమాత్మను దర్శించేటప్పుడు "సబ్రహ్మ, సహరి, సశివ, సేంద్రః సోఅక్షరః పరమ స్వరాట్" పంచ బ్రహ్మలు పరమాత్మయేనని నారాయణ సూక్తము తెలుపుచున్నది.

 

కృష్ణయజుర్వేదం తైత్తిరీయ సంహిత నాలుగవ అధ్యాయంలోని మూడవ ప్రశ్న యందు పంచబ్రహ్మలు పంచ ఋషుల రూపమున ఆవిర్భవించినారని వర్ణన కలదు.

 

పురాణాలలోనూ ఇదే అంశం వివిధ సందర్భాలలో ప్రస్తావించబడినది. "సద్యోజాత ముఖమాసీత్ మను విశ్వకర్మణే బ్రహ్మణ ఉత్పత్తిః వామదేవ ముఖమాసీత్ మయ విశ్వకర్మణే బ్రహ్మణ ఉత్పత్తి: అఘోర ముఖ మాసీత్ త్వష్ట విశ్వకర్మణే బ్రహ్మణ ఉత్పత్తి: తత్పురుష ముఖ మాసీత్ శిల్పి విశ్వకర్మణే బ్రహ్మణ ఉత్పత్తిః ఈశాన్య ముఖ మాసీత్ విశ్వజ్ఞ విశ్వకర్మణే బ్రహ్మణ ఉత్పత్తి:"

 

"సుపర్ణ, స్సానగశ్చైవ, సనాతన, ఇతి స్మృతః గురు శ్రేష్టో హభూనశ్చ ప్రత్నో ధాత్రీసురక్షకః విశ్వకర్మ ముఖోద్భూతా బ్రహ్మాణః పంచకీర్తితాః"

 

సుపర్ణ, సానగ, సనాతన, అహభూన, ప్రత్నులనెడి అయిదుగురును విశ్వకర్మ తేజో ముఖోద్భూతులైన పంచబ్రహ్మలని భావము . వీరు విశ్వకర్మయొక్క సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనెడి తేజో ముఖములనుండి సానగ, సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణులనెడి నామములతో ప్రభవించినారు.

 

పంచ బ్రహ్మలు : వీరే పూర్వఋషులు :

ఈ సానగాదులను “పూర్వఋషులని” ఋగ్యజురాది వేదములు అనుచున్నవి. యజుర్వేదీయ విశ్వకర్మ సూక్తములోని-

"త ఆయజన్త ద్రవిణగం సమస్మా ఋషయః పూర్వే జరితారో నభూనా, అసూర్తా సూక్తా రజసో విమానే యే భూతాని సమకృణ్వన్నిమాని,” సృష్ట్యాదియందు విశ్వకర్మనుండి పంచఋషులే కాక, సప్తఋషులుకూడ కలిగినారని విశ్వకర్మసూక్తములోని మంత్రమే చెప్పుచున్నది.

సప్తఋషులు :

“విశ్వకర్మా మనసా యద్విహాయా ధాతా విధాతా పరమోత సందృక్, తేషా మిష్ఠాని సమిషా మదన్తి యత్ర సప్తర్షీ న్పర ఏక మాహుః - యజు.కాం.4-6-2.

సప్తర్షులు విశ్వకర్మనుండి పుట్టినారను విషయమును అథర్వవేదము కూడా ఇట్లు ప్రతిపాదించుచున్నది.

"విశ్వకర్మాణం తే సప్త ఋషివన్త మృచ్ఛన్తు, యే మాఘాయవ ఉదీచ్యాదిశో భిదాసా."

- అథర్వ.కా.19, సూ.18, మంత్రము.7

విశ్వకర్మ సానగాదులైన పంచఋషులకే గాక, మరీచ్యాదులైన సప్తఋషులకు కూడా తండ్రియైనట్లు తెలియుచున్నదికదా. ఈ అథర్వవేదమంత్రమునకు కీ.శే. వడ్డెపాటి నిరంజనశాస్త్రి కవిశేఖరుల తెలుగుపద్యమును చూతము,

గీ."ఎవ్వ రుత్తరదిశ నుండి యేగుదెంచి అఘచయంబుల మము ద్రోతు రట్టి రిపులు సప్తఋషుల సృజించు ప్రసన్న విశ్వ కర్ము తేజో గ్ని దగ్ధత గాంత్రుగాక!”

ఈ విషయమును గీతాప్రమాణములో కూడా సాయణులు దిగువ అథర్వ వేదమంత్ర భాష్యములోనే స్పష్టీకరించిన ఘట్టమును చూతము.

"విశ్వకర్మా మా సప్తఋషిభి రుదీచ్యాదిశః పాతు తస్మిన్ క్రమే తస్మిం ఛ్రయే తాం పురం ప్రేమి. స మా రక్షతు, స మా గోపాయతు, తస్మా ఆత్మానం పరిదదే స్వాహా.” - అథర్వ. కాం.19, సూ.17, మంత్రము.7.

 

పంచాంగము పుట్టుక వివరణ

తిథిప్రోక్తం మనుబ్రహ్మ! వారస్య మయ సంభవం!! నక్షత్రం త్వష్ట రూపంచ! శిల్పయోగం తదైవచ!!

దైవజ్ఞం కరణంచైవ ఇత్యేతత్! అంగలక్షణం!!

దీనిని బట్టి తిథిని మనుబ్రహ్మ , వారాన్ని మయబ్రహ్మ , నక్షత్రాన్ని త్వష్టబ్రహ్మ ,యోగాన్ని శిల్పిబ్రహ్మ ,

కరణాన్ని విశ్వజ్ఞబ్రహ్మ ఇలా పంచాంగాన్ని ఐదుగురు బ్రహ్మలు రూపొందించారని అర్థమౌతుంది..

ఈ పంచబ్రహ్మలే సనాతన వైదిక బ్రాహ్మణులు.. వీరే మూల పురుషులు....

గాయత్రీ  అనే పేరుమీద ప్రసిద్ధమైన సవితృమంత్రార్థం:

గాయత్రీ మంత్రముచేత ఉపాసింప తగినవాడు "విశ్వకర్మ"యే అని తెలియజేయగలము. గాయత్రీ పదము స్త్రీ లింగములో ఉన్నను గాయత్రీ మంత్రార్ధము మాత్రము పుంలింగపరమయ్యే ఉన్నది. ఎట్లో చూతము- సవితృ మంత్రము ఋగ్వేదములో 3వ మండలమున 62వ సూక్తములో 10వ ఋక్కు ఇది గాయత్రి అనెడి ఛందస్సులోనే ఉన్నది.

" తత్సవితు ర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యో నః ప్రచోదయాత్.” (ఋ. 3-62-10)

దీనికి సాయణులభాష్యము ననుసరించి అర్థమును చూతము.

తా॥ ఏ సవితృదేవుడు మాయొక్క ధర్మధర్మాది విషయములైన బుద్ధులను ప్రేరేపించుచున్నాడో, ఆ అంతః ప్రేరకుడైన సవితృదేవుని యొక్క శ్రేష్టమైన భర్గమను తేజమును ధ్యానించుచున్నాము. అనగా సృష్టికర్తయు, బుద్ధిప్రేరకుడును అగు విశ్వకర్మ భగవానుని ధ్యానించుచున్నామని భావము.

 

కన్యాసంక్రాంతి విశిష్టత

కన్యా సంక్రాంతి (సెప్టెంబరు 17), అనగా.. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించే పర్వదినం.

కన్యారాశికి సంబంధించినది చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి అధిపతి విశ్వకర్మ (త్వష్ట). సూర్యుడే ప్రత్యక్ష విశ్వకర్మ కనుక, విశ్వకర్మ ఆధిపత్యం కలిగిన నక్షత్ర సంబంధ రాశిలోకి, సెప్టెంబరు 17 న సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక ఈరోజును

"విశ్వకర్మ పర్వదినం" అంటారు. కాబట్టి ఈరోజున.. ఈ మంత్రం యథాశక్తి జపించి, సూర్యభగవానునికి అర్ఘ్యం అర్పించి, ఆయురారోగ్య, ఐశ్వర్య వివాహయోగ, అన్యోన్య దాంపత్య, సత్సంతాన, వంశాభివృద్ధి ప్రదాతయగు విశ్వకర్మ భగవానుని అనుగ్రహం పొందండి.

 

భారత పూర్వ రాష్ట్రపతి తాత్త్వికులైన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితులు (Indian Philosophy Page No.102) భారతీయతత్వ శాస్త్రము అను గ్రంథమున విశ్వకర్మను గూర్చి యిట్లు వ్రాసియున్నారు.

"The First germ is the world egg floating on the primeval waters of chaos , the Principle of the universe of life. From it arises Vishwakarman the first borne of the Universe. The Creater and maker of the world " .

భావం : సృష్ట్యాదియందు మాయ అనే మావిలో విశ్వ జగత్తునకు మూలాధారమైన బ్రహ్మాండ బీజము(హిరణ్యగర్భము) తేలియాడు చుండెను. అట్టి బీజము నుండి మొదటివానిగా సమస్త విశ్వమును ధరించు సృష్టికర్తగా విశ్వకర్మయును, విశ్వపదార్థమును ఉదయించినవి.

X. 6.13 -- Visvakarman

 Not the artificer of the gods, but, as appears from both text and comment,

the maker of all, the creator, paramesvara --- H.H. Wilson

(sanskrit professor, first rigveda english translater)

తెలుగు అనువాదం: వేద మంత్రములు మరియు భాష్యములు రెండింటి ప్రకారం, ఆయన సర్వస్య కర్త, సృష్టి కర్త, పరమేశ్వరుడు, పరమాత్మ. (విశ్వకర్మ దేవతల శిల్పి కాదు, దేవ శిల్పి అని పురాణ కథనం మాత్రమే)

 

డా||దాశరథి రంగాచార్యగారి "శుక్ల యజుర్వేద సంహిత" ఆంధ్రానువాద ఆలోచనామృతం.

ముందుమాట (పే. నం . XLVII)

వేద దేవతలు నేడులేరు. వారికి ఆరాధన లేదు. ఇవ్వాళ రామ కృష్ణాది అవతారాలు, వారికి ఆలయాలు ఆరాధనలు ఉన్నాయి. నేడు బుద్ధునికి జైనతీర్థంకరులకూ, ఆదిశక్తి పరాశక్తులకు, జానపద దేవతలకు, ముత్యాలమ్మ, గంగానమ్మ, మరిడమ్మ, పోశమ్మలకు ఆలయాలూ, ఆరాధనలు ఉన్నాయి.

ఈ మధ్య కొత్త కొత్త దేవతలు(?) అవతరిస్తున్నారు. సాయి, సత్యసాయి, రాఘవేంద్రస్వామి, సంతోషిమాత

లాంటివారు. కాలక్రమంలో మరికొందరు రావచ్చు. పరమాత్మ సత్యస్వరూపుడు. ఇంతవరకు ఎంతటి మహర్షులకు ఆతని దర్శనమే కాలేదు. సృష్టి స్థితి లయకారుడగు పరమాత్మ అగమ్యగోచరుడు. అనిర్వచనీయుడు. పరమాత్మ లభించడు, అందడు. ఆ పరాత్పరుడే సమస్తాన్నీ సృష్టించాడు. ఆధారం లేకుండానే భూమిని, సూర్యచంద్రాది గ్రహనక్షత్రాదులను సృష్టించాడు. విశ్వం, భూమి, సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులకు పరమేశ్వరుడే ఆధారభూతుడు.

మరి.. ఆ పరాత్పరుణే కదా వేదం విశ్వకర్మ అని చెప్పింది..!

 విశ్వంలోని ప్రతి జీవికి  పరమాత్మ ఒక్కడే విశ్వకర్మ పరమాత్మ ది యూనివర్సల్ గాడ్

కన్య సంక్రమణం విశ్వకర్మ పరమాత్మ యజ్ఞ మహోత్త్సవం సందర్భవంగా సెప్టెంబర్ 17న

సేకరణ : బ్రహ్మశ్రీ డాక్టర్ కొండపి నాగేశ్వరరావు  వ్యవస్థాపకులు

శ్రీ వీర బ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ (రి) విశాఖపట్నం.

ఇవి కూడా చదవండి