బీసీలకు రాజకీయ న్యాయం కల్పించాలి -బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12 :
జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం , బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్లు టి. చిరంజీవులు (విశ్రాంత ఐఏఎస్), బాలగొని బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇంటెలెక్చువల్ ఫోరం , బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘56 శాతం బీసీలు.. రాజకీయ న్యాయం ఎక్కడ? తెలంగాణ రాజకీయ ముఖచిత్రం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా బీసీలకు ఇంకా సంపూర్ణ రాజకీయ స్వాతంత్ర్యం రాలేదన్నారు. మైనారిటీలుగా ఉన్న అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతోందని, జనాభాలో మెజార్టీగా ఉన్న బీసీలు రాజ్యాధికారం, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. బీసీలు రాజ్యాధికారం చేపడితే అన్ని కులాలకు ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సంఘాలు, పార్టీలు వేరైనా బీసీలంతా ఐకమత్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలని, గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తీర్మానించినట్లు చిరంజీవులు, బాలరాజ్ గౌడ్ వెల్లడించారు. వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ తదితర కులాలకు ఇప్పటివరకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదని, ఆయా కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని, బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. బీసీలకు జరుగుతున్న రాజకీయ అన్యాయంపై గణాంకాలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంతో పాటు, బీసీ సమాజంలోని అన్ని కులాలు, సంఘాలు, మేధావులు ఐక్యంగా ముందుకు రావాలని సమావేశం పిలుపునిచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విటల్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, కటకం నర్సింగరావు, ఎర్ర సత్యనారాయణ, తాడూరి శ్రీనివాస్, నీరజ, అంబాల నారాయణ గౌడ్ పాల్గొన్నారు.





