Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,106/10g+0.02%
भाषाएँ

Latest News

యాభై రెండేళ్ళ అరుణోదయలో యాభై ఏళ్ళ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాటాఆటామాటలతో సాగే ప్రజా కళా జాతర కరపత్రాన్ని నేడు ప్రజా కళా జాతర ఆహ్వాన సంఘం కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ లో ఆవిష్కరించడం జరిగింది.

The Organising Committee has unveiled the poster for a 50-hour People's Art Festival celebrating Arunodaya Vimalakka's 52-year cultural journey, scheduled for September 26-28, 2026, in Hyderabad.

nagendra13 September 2026, 2:29 AM20 व्यूtrinetnews.com
యాభై రెండేళ్ళ అరుణోదయలో యాభై ఏళ్ళ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాటాఆటామాటలతో సాగే ప్రజా కళా జాతర కరపత్రాన్ని నేడు ప్రజా కళా జాతర ఆహ్వాన సంఘం కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ లో ఆవిష్కరించడం జరిగింది.

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 12 :

నుంచి ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు,ఆచార్య కట్టా భగవంత రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మి, అరుణోదయ విమలక్క, పట్లోళ్ల నాగిరెడ్డి,మల్లేష్, మన్నారపు నాగరాజులు మాట్లాడుతూ...

ఈ నెల 26-27-28

(సెప్టెంబర్)2026 తేదీలలో 50 గంటల పాటు ప్రజా కళాజాతర హైదరాబాద్ లోని ఆర్టీసి కళ్యాణ మండపం,(అరుణోదయ నాగన్న ప్రాంగణం)బాగ్‌లింగంపల్లి యందు నిర్వహించ బడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నేటి ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం జనతా మంత్రమై దేశవ్యాప్తంగా విద్యార్థి- యువతను కదిలిస్తున్నట్లే,1960-70 ల కల్లోల దశాబ్దంలో నక్సల్బరి-శ్రీకాకుళం-

గోదావరిలోయ విప్లవోద్యమాలు అరుణోదయ ఏర్పాటుకు ప్రేరణ నిచ్చాయన్నారు. సహజంగానే విప్లవోద్యమాలు విప్లవ కవులను-కళాకారులను సృష్టించుకుంటాయి.కానీ అలాంటి విప్లవ ప్రజా సాంస్కృతికోద్యమాల్లో చివరికంటా నిలబడే వాళ్ళు అరుదుగా ఉంటారన్నారు.అలాంటి అరుదైన వ్యక్తుల్లో విమలక్క ఒకరన్నారు. ఇంట్లో నుండే తండ్రి, అమరుడు,తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ బండ్రు నర్సింహులు పోరాట వారసత్వాన్ని ఆమె అందుకుందన్నారు. ఎనిమిది పదులు దాటి కనుమూసిన తల్లి బండ్రు నర్సమ్మ కాయకష్టాన్ని, ఆత్మీయ ప్రేమలను పుణికిపుచ్చుకుందన్నారు. విప్లవ కార్యకర్త,కవి కామ్రేడ్ మిత్ర జీవిత సహచర్యం ఆమె విప్లవ ప్రజా కళా జీవితానికి తోడయ్యిందని,వందలాది మంది అమరుల త్యాగాలు ఆమెను ఆగిపోకుండా వెన్నుతట్టి ముందుకు నడిపించా యన్నారు.ఇంటి పక్క పొలంలో నాట్ల పాటలు, ఇంటి ముందు బతుకమ్మ ఆటా-పాటలు బాల్యం నుండే ఆమెను గాఢంగా ప్రభావితం చేశాయన్నారు. ఒగ్గు,ఢమరుకం శబ్దంతో కథా గానమైనా,పీరీల ఆటలైనా-పాటలైనా, బాలసంతు గంటల మేలుకొలుపులైనా,చిందు బాగోతాలైనా,శారద వీణపై పలికిన కమ్యూనిస్టు చింతలాపుడి రాంరెడ్డి కథయినా,బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న వీరగాథైనా, కిన్నెరపై పలికిన పండుగల సాయన్న సాహస గాథయినా విమలక్కనే కాదు, తెలంగాణ కవి గాయకులెందరినో ప్రభావితం చేశాయన్నారు. తెలంగాణ ప్రజా కళలు, జానపదాలు విప్లవతత్వంతో తెలంగాణ సమాజాన్ని విడదీయలేనంతగా పెనవేసుకున్నాయన్నారు. అందుకే విమలక్క తన జీవితంలో విప్లవ గేయాలను గద్దర్ లాగా ప్రదర్శన స్థాయికి తీసుకురాగలిగిందన్నారు. బుర్రకథ,ఒగ్గు కథ,భూమి బాగోతం,బతుకమ్మ, కోయ-గోండు నృత్యాలు, ప్రత్యేకించి సిగ్నేచర్ డ్యాన్సులో డప్పు కళాకారుల నృత్యం లాంటివి ఎన్నో ఆమె ప్రదర్శనలలో భాగమై ఉన్నాయి.ఇవే నేటి ప్రజా కళాజాతరకు ప్రేరణ అన్నారు.

50 ఏళ్ల కాలంలో విమలక్క పాడిన పాటలన్నీ పాడుతూ ఆమెతో గొంతు కలుపుదాం.తద్వారా ప్రజా ఉద్యమాలతో మమేకమౌదాం.విమలక్క ఆడిన ఆటలకు పాదం కలుపుదాం.తద్వారా ప్రజా ఉద్యమాల సంస్కృతిక సారధులుగా నిలబడుదాం.విమలక్కనే కాదు మొత్తం తెలుగు సమాజాన్ని,భారతదేశాన్నిఉర్రూతలూగించిన జానపద సంపదతో, లెక్కలేనన్ని కళారూపాలతో మమేకమౌదాం. అంతరించే దశలో ఉన్న వాటిని తట్టి లేపుదాం. అనాధరణకు గురవుతున్న వాటిని ఆదరిద్దాం.అందుకే విమలక్క యాభై ఏళ్ల పాటు పాడుతున్న విప్లవ పాటలు,కుల హక్కుల పాటలు,సామాజికోద్యమ పాటలు,పర్యావరణ పాటలు,అమరుల స్మృతి గీతాలు,స్త్రీ విముక్తి గీతాలు,ఆదివాసీ స్వయం పాలనా పాటలు, బృందగానాలు అన్నీ కలిసి పాడుదాం. కార్పోరేటీకరణ, మనువాదాలు కవల పిల్లలై సాగిస్తున్న దాడులను నిరసిస్తూ ఆమె పాడిన పాటలతో, వర్తమానంలో సాగుతున్న ఉద్యమాలతో మమేకమవుదాం.

ప్రజా కోణం నుండి ప్రదర్శించబడుతున్న సకల నృత్య రీతులు, కళారూపాలు అన్నీ ప్రదర్శిద్దాం.అదే సమయంలో ఆమె ప్రదర్శించిన బుర్రకథ, ఒగ్గు కథ, బ్యాలే,నృత్య నాటిక మొదలుకొని అన్ని మనమే మళ్ళీ ప్రదర్శన చేద్దాం.తెలుగు నేలపై ప్రత్యేకించి కళల కాణాచిగా తెలంగాణలో ఉదయించిన అన్ని కళల ప్రదర్శనకు 50 గంటల పాటు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.”ప్రజా కళా జాతర”లో భాగస్వామ్యం కావడానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.ఈ కార్యక్రమం ఆద్యంతం రికార్డు చేసి ప్రజలకు అందించబడుతున్నందున తాము పాడే పాటలను, కళారూప ప్రదర్శనలను ముందుగా కార్యక్రమ నిర్వాహకులతో నమోదు చేసుకోవాలని తద్వారా సమన్వయం చేసుకోవాలని కోరుతున్నాం.ఇది కేవలం 50 పాటల కార్యక్రమం మాత్రమే కాదు.50 మంది ఉపన్యాసకుల విశ్లేషణలు,50 అనుభవాల మేళవింపు కార్యక్రమం.అలాగే ఇక్కడ విమలక్క పాటల ప్రదర్శనలే కాదు, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ లతో పాటు నలుమూల నుండి వచ్చే బహుళ ప్రజా కళలు, జానపద కళారూపాలు అన్నీ ప్రదర్శించబడే ప్రజా కళా జాతర.మనువాద సంస్కృతి మూఢత్వమై, సామ్రాజ్యవాద సంస్కృతి విశృంఖల దోపిడితత్వమై సాగిస్తున్న దాడికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో భాగమయ్యే సంస్థలను, శక్తులను,వ్యక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.విప్లవ ప్రజా సాంస్కృతిక శక్తుల ఐక్యతను కాంక్షిస్తున్నాం.

అరుణోదయ విమలక్క ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి.1974 మే 12న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో పురుడు పోసుకునేటప్పటికే బాల గాయనిగా అడపాదడపా ఆమె తండ్రి వేలు పట్టుకుని వెల్తూ ప్రజావేదికలపై పాడుతున్నారు. అరుణోదయ ఆవిర్భావం తర్వాత ఆలేరుకు వచ్చిన అరుణోదయ ప్రచార బృందంతో కలిసి క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.ఎమర్జెన్సీలో జైల్లో ఉన్న తండ్రి కామ్రేడ్ బండ్రు నర్సింహులును చూడడానికి పోయినప్పుడు కాశీపతి, హెచ్ ఆర్కె,వరవరరావు తదితరులు ఆమెతో జైల్లోనూ పాటలు పాడించుకున్నారు. 1976లో కామ్రేడ్ జంపాల స్మృతిలో గూడ అంజన్న రాసిన పాటను రాంసత్తయ్య ద్వారా నేర్చుకొని పాడే నాటికే విమలక్కకు 12 ఏళ్ళు నిండాయి.వాస్తవంగా 2016లో టిపిఎస్‌కె, నటరాజ కళానికేతన్‌లు కల్సి విమలక్క 45 ఏళ్ళ పాటల ప్రస్థానం సభ జరిపారు.అందులో గద్దర్ పాల్గొన్నారు.

అయితే విమలక్కకు కానూరి వెంకటేశ్వరరావు, రాంసత్తన్న లాంటి గురువులు,రామారావు, నాగన్న,రాజేంద్రప్రసాద్, అంబిక,ప్రొ. వినయ్ బాబు,వీరన్న,కరుణ, గంగ,ఉష,దేవి,చైతన్య, జయ,బాల్‌నర్సయ్య, చందర్ రాములు, రాయికృష్ణ లాంటి ప్రజా కళా యోధుల సహచర్యం ఒక ఎత్తయితే,విమలక్క శక్తి అంతా బృందగానం. విద్యార్థినిగా పిడిఎస్‌యు లో చేరి భువనగిరి డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యదర్శిగా గెలిచింది. పీఓడబ్ల్యూ (స్త్రీ విముక్తి) నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర కోశాధికారిగా ఎన్నో మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించింది. అయినా విమలక్క ప్రధాన చిరునామా మాత్రం అరుణోదయనే. ఆమె ప్రధాన కృషి అంతా ప్రజా సాంస్కృతిక ఉద్యమ గానమే.ఈ కృషిలో సంస్థతో పాటు, తన బృందం యొక్క శక్తి విమలక్క ద్వారా సమిష్టిశక్తిగా ప్రదర్శితమవుతుంది. అందులో కంజెర,డప్పు, డోలు,గజ్జెలు,ఒక్కోసారి పిల్లనగ్రోవి అన్ని వాయిద్యాలు తోడై బలమిస్తాయి.తన బృందంతో ఢిల్లీ,ముంబై, కలకత్తా,బెంగళూరు, చెన్నై,లక్నో,రాంచి, లాంటి మహానగరాలతో పాటు గోవా, కళింగ నగర్, (ఒరిస్సా), జాజా (బీహార్), బిలాయి (ఛత్తీస్ గడ్) త్రిశూర్ (కేరళ), జలంధర్ (పంజాబ్) లాంటి ఉద్యమ ప్రాంతాలన్నీ తిరిగారు. అమెరికా,మలేషియా లాంటి దేశాల తెలుగు సంఘాలతో ఎన్నో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. 1995లో తిరుపతి, 1995లో హైద్రాబాద్, 2004లో ముంబై, 2014లో హైద్రాబాద్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో తన బృందంతో ప్రదర్శనలిచ్చారు. బహుజన బతుకమ్మను తలకెత్తుకుని 15 ఏళ్లుగా తెలంగాణ చుట్టిరావడంతో పాటు, ఖతార్ వెళ్లి బతుకమ్మ ఉద్యమ సందేశం వినిపించారు.తన ప్రస్థానంలో డజన్ల కొలది పాదయాత్రలు, అరెస్టులు, కేసులు, జైళ్లే కాకుండా ప్రజల మన్ననలందుకున్న సత్కారాలు, అవార్డులు ఉన్నాయి. ఆమెపై నిర్బంధాన్ని ఖండిస్తూ పలు పుస్తకాలు వచ్చాయి. ప్రజా ఉద్యమ అవసరాల్లో విమలక్క రాసిన వ్యాసాలతో పాటు, ఇంటర్వ్యూలు, పోడ్ కాస్టులకు లెక్కేలేదు. ఆమె కళా ప్రదర్శనలను, వ్యక్తిత్వాన్ని విడమర్చి చెప్పే వ్యాసాలున్నాయి. పలు వాఖ్యానాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆమె పాటా-అటా-మాటా అన్నింటికి మించి మిలిటెంట్ పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.అవన్నీ గుది గుచ్చి ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాం.ఈ కృషిలో విమలక్క తన జీవితాన్ని ప్రజలకంకితం చేసి బతుకొచ్చని నిరూపించారు.అలాంటి అంకిత స్వభావం గల కార్యకర్తలను,ప్రజా కళాకారులను తీర్చిదిద్దుకోవడానికి విమలక్క ప్రస్థానం స్ఫూర్తిదాయకం కావాలని ఆశిస్తున్నాం.50 గంటల పాటు సాగే ఈ ప్రజా కళా జాతర నిర్వహణ కమిటీలో స్వచ్చంధంగా భాగం కావాలని ఆయా సంస్థలను,శక్తులను, వ్యక్తులను సవినయంగా కోరుతున్నాం.ఈ సందర్భంగా “అరుణోదయ విమలక్క ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానం విప్లవ సాంస్కృతికోద్యమ “దశా`దిశ” అనే పుస్తకాన్ని వెలువరిస్తున్నాం. వందలాది మంది కవులు -కళాకారులు, విద్యావేత్తలు,న్యాయ కోవిదులు, హక్కుల కార్యకర్తలు, ప్రజా వైద్యులు, కుల నిర్మూలనా వాదులు, జర్నలిస్టులు ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామిక- అభ్యుదయ శక్తులంతా ఈ ఆహ్వానసంఘంలో భాగస్వాములే.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆర్థికంగా, హార్దికంగా సహకరించా లని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో... అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, సహాయ కార్యదర్శి రాకేష్, ఉపాధ్యాయ దర్శిని పత్రిక పూర్వ సంపాదకులు ప్రకాష్ రావు,LHPS పాండు నాయక్, AIFTU నాయకులు యాకయ్య, రైతు-కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరావు,PDSU (విజృంభణ)

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్,AIFTU ప్రధాన కార్యదర్శి అంజయ్య, ఒగ్గు రవి,వెంకటేష్, రాజేష్,సౌమ్య,శ్రీలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

ప్రజా కళా జాతర ఆహ్వాన సంఘం.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →