పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి 45 రోజుల గడువు
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో త్రిసభ్య కమిటీల ఏర్పాటు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,
సెప్టెంబర్ 19: తెలంగాణ నేలకు వెలుగులు పంచేందుకు భూమి పొరల్లోకి దిగి, తమ చెమటను నల్ల బంగారంగా మారుస్తున్న సింగరేణి కార్మికుల సేవలు వెలకట్టలేనివని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సింగరేణి కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్ల స్థలాలపై హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్నాయని, వారి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సింగరేణి బొగ్గు బెల్ట్ ప్రాంతంలోని ఇళ్ల స్థలాల సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం చూపుతూ, అర్హులైన కుటుంబాలకు హక్కు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికుల ఇండ్ల స్థలాల సమస్యపై శనివారం నాడు సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ,
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో జారీ చేసిన జి. ఓ. నె. 76, పరిగణనలోకి తీసుకొని, భూముల స్వభావం, ప్రభుత్వ/సింగరేణి హక్కులు, ప్రస్తుత నివాస పరిస్థితులు, చట్టపరమైన అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
45 రోజుల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం
సింగరేణి బొగ్గు బెల్ట్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను గౌరవ హైకోర్టు ఆదేశాలకు లోబడి 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి, జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు.
దరఖాస్తుల పరిశీలనలో ఏవైనా అవకతవకలు లేదా నిబంధనలకు సంబంధించిన అంశాలు గుర్తిస్తే, అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం వాటిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కుటుంబాలకు చట్టబద్ధమైన హక్కు కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.





