ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10 :
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు దళితులు వచ్చారనే కారణంతో బీఆర్‌ఎస్ నాయకులు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడాన్ని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ దళితులను చిన్నచూపు చూడటం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య సమాజంలో సరికాదన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక సమానత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు ను ఓడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొత్తపల్లి తిరుపతి తెలిపారు. ప్రజా ప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. తక్షణమే బీఆర్‌ఎస్ నాయకులు దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రమేష్, రాజేందర్, చరణ్, స్వామి అరుణ్, ఆకాష్, కుశాల్, ఆంజనేయులు, వెంకటేష్, అఖిల్, రాజు, సాయి, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.





