ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:23 pm

బుధవారం

9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:23 pm

SENSEX75,578-1.30%
NIFTY23,522-1.64%
హైదరాబాద్ 22K₹1,44,029/10g+1.23%
హైదరాబాద్ 24K₹1,57,123/10g+1.23%
వెండి₹2,20,565/kg+3.41%

తాజా వార్తలు

ఘనంగా ఓయూలో 85వ స్నాతకోత్సవం.. * 640 మందికి పీహెచ్‌డీ పట్టాలు.. 71 మందికి బంగారు పతకాలు..

Governor CP Radhakrishnan and Bharat Biotech Executive Chairman Dr. Krishna M. Ella urged youth to become job creators rather than job seekers at Osmania University's 85th convocation.

nagendra9 September 2026, 1:12 AM0 చూసులుtrinetnews.com
ఘనంగా ఓయూలో 85వ స్నాతకోత్సవం..  * 640 మందికి పీహెచ్‌డీ పట్టాలు.. 71 మందికి బంగారు పతకాలు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఉద్యోగాల కోసం వెతకకుండా.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా..

ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్‌ 8 :

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 85వ వార్షిక స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. తెలంగాణ గవర్నర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డా. కృష్ణ ఎం. ఎల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 640 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలు, వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 71 మందికి బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను సమర్పించారు. స్నాతకోత్సవంలో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా మాట్లాడుతూ యువత ఉద్యోగాలు కోరుకునే వారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిగా ఎదగాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, స్వయం ఆధారిత యువత అవసరమని పేర్కొన్నారు. యువతను మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి రక్షించేందుకు సమాజం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. దాదాపు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ చారిత్రక ప్రాంగణం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు అందుకున్న విద్యార్థులను అభినందించడంతో పాటు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, పరిశోధనా పర్యవేక్షకుల కృషిని ప్రశంసించారు. ముఖ్య అతిథి డా. కృష్ణ ఎం. ఎల్లా మాట్లాడుతూ విద్యార్హతలకు మాత్రమే పరిమితం కాకుండా యువత నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికత, సమాజ సమస్యలకు పరిష్కారాల దిశగా ఆలోచించాలని సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులైన మాజీ ప్రధాని దివంగత పి.వి. నరసింహారావు, వ్యోమగామి రాకేశ్‌ శర్మ, ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌, మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ డా. వై.వి. రెడ్డి తదితరుల వారసత్వాన్ని ప్రస్తుత విద్యార్థులు కొనసాగించాలని అన్నారు. మాతృభాషలో విద్యాభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలను అభ్యసనం, పరిశోధన, సృజనాత్మకతకు వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంగ్లిష్‌ విభాగంలో ఎస్టీ విద్యార్థి సమర్పించిన ఉత్తమ పీహెచ్‌డీ థీసిస్‌కు తెలంగాణ గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ సహా మొత్తం 71 బంగారు పతకాలను అందజేశారు. కళలు, వాణిజ్యం, విద్య, ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మాటిక్స్‌, న్యాయ, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, టెక్నాలజీ తదితర విభాగాలకు చెందిన 640 మంది డాక్టరల్‌ పరిశోధకులు పట్టాలు అందుకున్నారు. ఉపకులపతి ప్రొఫెసర్‌ కుమార్‌ మోలుగారం మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, సంస్థాగత అభివృద్ధికి ఓయూ నిరంతరం కృషి చేస్తోందన్నారు. మారుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా విద్యార్థులు, పరిశోధకులను తీర్చిదిద్దడంతో పాటు పరిశోధన ఫలితాలు సమాజానికి ఉపయోగపడేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు, డీన్లు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి