బేగంపేట, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5 :
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి నిర్వాహకులకు సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ సూచనల మేరకు బేగంపేట పోలీసుల ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 300 మంది వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లేదా మల్కాజిగిరి పోలీస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే అందించాలని సూచించారు. విద్యుత్, అగ్నిమాపక, పురపాలక శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందడంతో పాటు మండపాల ముఖ్య నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లను పోలీసులకు నమోదు చేయాలన్నారు. ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో ట్రాఫిక్, పాదచారులకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. మండపాల వద్ద ఇసుక బకెట్లు, నీరు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలని, రాత్రివేళల్లో కనీసం ఇద్దరు వాలంటీర్లు ఉండేలా చూడాలని సూచించారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లౌడ్‌స్పీకర్లను నిబంధనల మేరకే వినియోగించాలని, డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే ప్రసారం చేయాలని స్పష్టం చేశారు. నిమజ్జనం రోజు, సమయం, వాహనం, ఊరేగింపు రూట్ వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, అల్లర్లు చేయడం, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను దెబ్బతీసే నినాదాలు, ఫ్లెక్సీల ఏర్పాటును పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, అత్యవసర పరిస్థితుల్లో 100, 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో బేగంపేట ఇన్‌స్పెక్టర్ సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






