ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:17 pm

బుధవారం

16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:17 pm

SENSEX74,366-0.72%
NIFTY23,257-0.94%
హైదరాబాద్ 22K₹1,43,751/10g-0.99%
హైదరాబాద్ 24K₹1,56,819/10g-0.99%
వెండి₹2,16,812/kg+0.85%

తాజా వార్తలు

రైతు నేస్తం 107వ ఎపిసోడ్‌లో ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ

Agricultural Production Commissioner and Secretary K. Surendra Mohan distributed natural farming kits to farmers during the 107th episode of Rythu Nestham.

nagendra16 September 2026, 2:13 AM1 చూసులుtrinetnews.com
రైతు నేస్తం 107వ ఎపిసోడ్‌లో ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 15: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "రైతు నేస్తం" వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం 107వ ఎపిసోడ్ మంగళవారం ప్రసారమైంది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) పథకం కింద రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ & వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్, (ఐఏఎస్)పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి

(ఐఏఎస్) పరిచయ వ్యాఖ్యలతో ప్రారంభించారు. అనంతరం

పీజేటీఏయూ, వ్యవసాయ శాఖకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఎల్‌నినో ప్రభావం అంశంపై ఐఎండీ శాస్త్రవేత్త డా. శ్రావణి, భూగర్భ జల శాఖ సంయుక్త సంచాలకులు, నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్ తదితరులు వర్షపాతం పరిస్థితి, భూగర్భ జలమట్టాలు, నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై వివరించారు.

జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం రాజారాం తండాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ప్రకాష్ నాయక్ తన విజయగాథను రైతులతో పంచుకున్నారు. ఏడు రకాల వరి సన్న వంగడాల ప్రాముఖ్యతపై PJTAU వరి పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త, డైరెక్టర్ డా. వై. చంద్రమోహన్ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, (ఐఏఎస్) మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన పంటలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉందని, ఆరోగ్య స్పృహతో వినియోగదారులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులనే ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు ప్రకాష్ నాయక్‌తో స్వయంగా సంభాషించి, ఆయన అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవాలని, ఆ స్ఫూర్తితో మరింతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులకు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కిట్లను అందజేశారు. పండించిన పంటను రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయించినప్పుడే అధిక ఆదాయం పొందగలరని, ఇందుకోసం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం ప్రత్యేకంగా 'టీజీ ఆర్గానిక్స్' యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల పూర్తి వివరాలు పొందుపరచామని, సేంద్రియ ఉత్పత్తులు కోరుకునే వినియోగదారులు ఈ యాప్ ద్వారా సరైన సమాచారం పొంది నేరుగా కొనుగోలు చేయవచ్చని వివరించారు. దళారీ వ్యవస్థపై ఆధారపడకుండా రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఐ )గా ఏర్పడి సొంతంగా మార్కెటింగ్ చేసుకున్నప్పుడే ఆదాయం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ సంఘాల బలోపేతం కోసం ఈ నెలలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులంతా కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశమై, వాటి బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం అమలు తీరు గురించి వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, ఐఏఎస్ మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయం చేపడుతున్న రైతులను ప్రోత్సహించేలా ఈ పథకం ద్వారా క్షేత్రస్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లను ఏర్పాటు చేసి, గ్రామస్థాయిలో సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఫలితాల పత్రాలను అందజేస్తున్నామని, గ్రామస్థాయిలోనే బయో రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేసి ఘనజీవామృతం, బీజామృతం, జీవామృతం వంటి కషాయాల తయారీపై శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఏడు వరి సన్న రకాలు పండించిన రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి, క్వింటాలుకు రూ.500 బోనస్ అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ విత్తనాలు వేసిన రైతులు తమ కొనుగోలు వివరాలను సంబంధిత డీలర్ల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, డీలర్ల వద్ద కొనుగోలు చేయకుండా సొంత విత్తనాలను వినియోగించిన రైతులు స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించి, వ్యవసాయ విస్తీర్ణాధికారి వద్ద ఆన్‌లైన్‌లో తమ సాగు వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

అలాగే, రైతులు తాము సాగు చేసిన వివిధ పంటల విస్తీర్ణ వివరాలను తమ పొలాల వద్దకు వచ్చే వ్యవసాయ వాలంటీర్లకు అందజేసి, డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్‌లో నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంట వివరాలు నమోదైన అనంతరం రైతులకు మెసేజ్ రూపంలో నిర్ధారణ సమాచారం అందుతుందని, ఇందులో ఏమైనా తేడాలు ఉంటే 72 గంటల్లోపు వ్యవసాయ విస్తీర్ణాధికారిని కలిసి సరిచేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ రెండు అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా. జె. శ్రీనివాస్, ఎల్‌నినో నేపథ్యంలో పండిస్తున్న కూరగాయల పంటల యాజమాన్యంపై రైతులకు సూచనలు అందించారు. కార్యక్రమం చివరిలో శాస్త్రవేత్తలు, అధికారులతో రైతులు నేరుగా ముఖాముఖి నిర్వహించి, తమ సందేహాలు, సూచనలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి