హైదరాబాద్, ట్రినెట్ న్యూస్, సెప్టెంబర్ 12: నాగపూర్- వరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవే త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
అన్నారు. శనివారం శాసన మండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రొ.కోదండరామ్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.
పర్కాల్ ప్రాంతానికి దగ్గరగా ఎగ్జిట్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై ఎన్‌హెచ్‌ఏ అధికారులకు రేపే ఆదేశాలు ఇచ్చి, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నాగ్‌పూర్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ హైవే చాలా ముఖ్యమైన రహదారి అని మొత్తం 310 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాజెక్టులో 280 కిలోమీటర్లు తెలంగాణలోనే ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ రహదారి నాలుగైదు జిల్లాలను కలుపుతూ, తెలంగాణ నుంచి నాగ్‌పూర్, విజయవాడ వైపు ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల–వరంగల్ రహదారిని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. 2023 మార్చి 31న ఎల్ఓఏ ఇచ్చి, మే 23న అగ్రిమెంట్ జరిగిందని,, మొదట 730 రోజుల్లో, అంటే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భూసేకరణ, కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. భూసేకరణలో సమస్యలు పరిష్కరించాం. చిన్నచిన్న సమస్యలతో కొంత భూమి మాత్రమే పెండింగ్‌లో ఉందని, దానిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు.
ఆలస్యం కారణంగా కాంట్రాక్టర్‌కు ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్ ఇచ్చి, 31-12-2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మే 26న ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా రివ్యూ చేశారన్నారు. తెలంగాణకు ఈ రహదారి ఎంత ముఖ్యమో, ముఖ్యంగా నాగ్‌పూర్‌కు వెళ్లే ప్రజలకు ఎంత ఉపయోగకరమో ఆయన స్పష్టంగా చెప్పారని మంత్రి తెలిపారు. భూసేకరణ విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు. వారికి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కోదండరామ్ లేవనెత్తిన భూసేకరణ సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల మాత్రమే భూమి అప్పగింత పెండింగ్‌లో ఉంది. ఒకచోట సుమారు 1 నుంచి 1.30 కిలోమీటర్లు, మరో ప్యాకేజీలో 5.7 కిలోమీటర్ల మేర సమస్య ఉందని, దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాగా, నిర్మాణ పనులు మొత్తం ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఎన్హెచ్ఏఐ కి పూర్తి సహకారం అందిస్తోందని చెప్పారు.
ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. 31 డిసెంబర్ 2027 నాటికి ఈ కీలక రహదారి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.





