హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్08
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ను నియమించాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ లో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బంజారా సామాజిక వర్గానికి సుమారు 15 కోట్ల జనాభా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారికంగా 25 లక్షల మంది బంజారాలను గుర్తించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో లంబాడ, బంజారా వర్గాల ప్రజలు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి తగిన గౌరవం, ప్రాధాన్యత, మంత్రి పదవి దక్కలేదని అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు ఆలోచించి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోరిక బలరాం నాయక్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న బంజారా వర్గానికి కాంగ్రెస్ పార్టీలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవులు కల్పించిందని, ఎస్టీ వర్గానికి ఇప్పటివరకు ఆ అవకాశం దక్కలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న బలరాం నాయక్‌కు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని లంబాడీ సంఘాల తరఫున కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రవి నాయక్, ప్రవీణ్ నాయక్ మాలోత్, సురేష్ నాయక్, గోపి నాయక్, స్నేహ, స్వప్న, రమేష్, ప్రకాష్, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకురాలు రుక్మిణిబాయి, టీఆర్‌పీఎస్ నాయకురాలు సంధ్యాబాయి, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కొర్ర లక్పతి, చందులాల్ రాథోడ్, భూక్య భాస్కర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయక్, రంగాలాల్ నాయక్, గుగులోతు శ్రీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.





