హైదరాబాద్,చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 28 :
సినీ విజ్ఞాన విశారద ఎస్.వి. రామారావు 87వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన తల్లిదండ్రులు చంద్రమౌళేశ్వరరావు కామేశ్వరమ్మ జ్ఞాపకార్థం
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. గుళ్ల సూర్యప్రకాశ్ కు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమం కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఎఎస్ (రి), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కెవి.రమణ చారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్డియాలజిస్ట్ డా. గుళ్ల సూర్యప్రకాశ్ తన దగ్గరికి వచ్చే బాధితులకు ధైర్యాన్ని చెప్పి ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. ఆయన వైద్య రంగంలో అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు.
ఎస్.వి. రామారావు సినీ, కళా రంగంలో అనేక సేవలు చేశారని పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రముఖ రంగస్థల, సీరియల్, టి.వి. నటులు, దర్శకులు డా. ఎస్.బి. కిశోర్ (చంద్రపూర్), నామాల మూర్తి (వైవిఎస్ మూర్తి)కి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కిన్నెర సంస్థ కార్యదర్శి మద్దాలి రఘురామ్ స్వాగతోపన్యాసం చేసిన కార్యక్రమంలో పూర్వమంత్రి, శాసనసభ్యులు, మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త డా. పాలకుర్తి మధుసూదనరావు, ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయ శర్మ, యువ కళావాహిని అధ్యక్షుడు లంకా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు గీతాలయ ఆర్ట్స్ సమర్పణలో "అక్కినేని ఆణిముత్యాలు" పేరిట గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి










