ట్రైనెట్ లైవ్ టీవీ ప్రత్యేక కథనం: జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, పరీక్షల్లో అపజయాలు, నమ్మినవారి మోసం వంటి పరిస్థితులు మనిషిని తీవ్ర నిరాశకు గురిచేయవచ్చు. అయితే ఎంతటి సమస్య ఎదురైనా జీవితాన్ని వదులుకోవాలనే నిర్ణయం తీసుకోకుండా, కాస్త ఓపికతో పరిస్థితులను ఎదుర్కొని పరిష్కార మార్గం వెతకాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎం. జయకృష్ణారెడ్డి సూచించారు.
ఒక రోజు రైలు ప్రయాణం. క్రిక్కిరిసిన జనం. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళతో సందడిగా ప్రయాణం సాగుతోంది. ఇంతలో ఒక అరుదైన వ్యాధినలన నడవలేని ఒక వ్యక్తి ఆపిల్స్ భుజాన వేసుకుని అమ్మడం ప్రారంభించాడు. ఇది చూసి రైలులో నా ప్రక్కన కూర్చున్న వ్యక్తి నాతో ఇలా అన్నాడు.
"ప్రయాణీకులకు సేవచేయడంలో వచ్చే ఒకటో, రెండు రూపాయిలతో కుటుంబాన్ని పోశిస్తూ, ఎలాగైనా బ్రతకాలని తపించే ఆ వ్యక్తిని చూస్తుంటే, మరి నాకు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చావాలనిపించే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు" అని.
ఒక్క క్షణం ఆ మాటలు వినగానే నేను మౌనంగానే ఉండిపోయాను. అతని మాటల్లో నిజం లేకపోలేదు అనిపించింది.
ఇటీవల వార్తల్లో ఇలాంటి చాలా సంఘటనలు చూస్తుంటాము. మార్కులు సరిగా రాలేదని తండ్రి మందలించాడని, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఒక విషయంలో అవమానకరంగా మాట్లాడారని, 'తన' అనుకున్నవాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారని, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని, ఈ బాధలన్నింటికీ జీవితం వద్దని, ఎంత ప్రయత్నించినా ఇక ఉపయోగం లేదని ఇలాంటి చాలా కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు తరచుగా వింటున్నాం కదా!
ఏదైనా ఒక వస్తువును కిందకు దించకుండా అరచేతిలో అలానే మోస్తూ ఉంటే కాసేపటికి నెప్పి ప్రారంభమై, మోచేతి గుండా భుజం చాలా నోప్పి పెరుగుతుంది. ఇక్కడ సమయం పెరిగిన కొద్దీ వస్తువు బరువు పెరగలేదు, కేవలం మనం ఆ వస్తువుని ఎంత ఎక్కువ సేపు చేతిలో మోస్తామో అంత ఎక్కువగా నోప్పి ఉంటుంది. మరి తల్లి 9 నెలలు 'బరువు' అని అనుకోకుండా మనల్ని మోసింది. బిడ్డని కనే సమయంలో తను ఎదుర్కొనే ఆ ప్రసవ వేదన తనకి పునర్జన్మ లాంటిది. మనల్ని ఈ భూమిమీదకు తీసుకురావడం కోసం తల్లి 9 నెలల పాటు పడే ఆ నోప్పి కంటే పెద్దవా మనం జీవితంలో ఎదుర్కొనే సమస్యలు?
ఒక్కసారి ఆలోచించండి!
నేను "సమస్యలు చిన్నవి" అనడం లేదు, సమస్యల్లో ఉన్నప్పుడు "బాధ ఉండదు" అని కూడా అనడం లేదు. కానీ ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు కాస్త ఓపికగా ఉండాలి అని చెప్పడమే నా ఉద్దేశం.
మనం ఎంత వద్దనుకున్నా ఏదో ఒక రోజు ప్రాణం పోవాల్సిందే, కానీ ఒకసారి పోతే మళ్లీ ప్రాణం తెచ్చుకోగలమా?
"ఒక్కటే జీవితం... ఏం జరిగినా సరే, అస్సలు వదులుకోవద్దు."
ఇక సమస్యలంటారా...? ఏ వ్యక్తి కూడా పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా ఒంటరిగా బ్రతకలేడు.
సమాజంలో మన చుట్టూ ఉండే వ్యక్తులతో కలిసి బ్రతకాల్సిందే. ఆ చుట్టూ ఉండే వ్యక్తులందరూ మన లాగే మన లాంటి సాంఘిక, ఆర్థిక పరిస్థితుల్లో పెరిగి ఉండకపోవచ్చు. కాబట్టి వారందరి ఆలోచన, ప్రవర్తన మనలాగా ఉండకపోవచ్చు. వారి ప్రవర్తన ద్వారా మనకు ఇబ్బంది, మానసికంగా అలజడి ఏర్పడవచ్చు.
కాబట్టి ఏ వ్యక్తికైనా ఇతరుల ద్వారా అవమానం, మోసం, ఒంటరితనం అనేవి ఎప్పుడు, ఏ విధంగానైనా జరగవచ్చు. అది మనకు మాత్రమే జరిగినట్లు, తాత్కాలికంగా ఊపిరి ముగించేయాలని అనుకోకూడదు.
మనకున్న ఏ ఆలోచన వలన ఈ సమస్య వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆలోచనని ఎలా మార్చుకోవాలో తెలుసుకో. మనుషుల అసలైన ప్రవర్తన ఇప్పటికైనా తెలిసినందుకు సంతోషించు. పదే పదే జరిగిన సంఘటనను మనసులో గుర్తు చేసుకుంటూ ఉండకు, సంఘటన మూలాలు గుర్తించు. దానివల్ల మనం ఎలా ఆలోచించడం నేర్చుకోవాలి, మరొకసారి ఇలాంటి సంఘటన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఆలోచించు. నువ్వు నమ్మిన అతి కొద్దిమంది దగ్గర అవసరమైతే చర్చించు. ఒక పరిష్కార మార్గం వెతుకు.
ఏ సమస్య అయినా మన ప్రాణం కంటే పెద్దది కాదు. బ్రతికున్నంత వరకు ఈ భూమిమీద మనదంటూ ఒక ముద్ర వేయాల్సిందే.
మనం పోయేలోపు చుట్టూ ఉన్న పదిమంది కళ్ళలో సంతోషం నింపాలి. మన పని నైపుణ్యంతో పదిమందికీ స్ఫూర్తినివ్వాలి. అందుకోసం ఏ కష్టమైనా తట్టుకుని నిలబడగలిగేలా ఉందాం.
చనిపోవాలనే ఆలోచన వచ్చిన క్షణం తల్లి మనల్ని భూమిమీదకి తీసుకురావడానికి పడిన కష్టం, ఇన్ని సంవత్సరాలు తన ప్రాణాల కన్నా ఎక్కువగా మనమీద చూపిన ప్రేమని గుర్తు చేసుకో! మన గురించి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునేలా ఎదుగుదాం. మనం పరిష్కరించలేనంత వరకే సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి పరిష్కారం ఆలోచించు, దాన్ని అమలు చేస్తే ఇక అది సమస్యే కాదు.
చివరగా చెప్పేది ఒకటే...
ప్రాణం తనంత తాను పోయేవరకు బ్రతుకుదాం.
జీవితం ఎలా ఉన్నా సరే పోరాడుదాం...
ఉన్నంత వరకు పదిమందికీ స్ఫూర్తినిద్దాం.
రచయిత వివరాలు
M. JAYA KRISHNA REDDY
(M.S. Counseling & Psychotherapy)
Motivational Speaker





