సికింద్రాబాద్: మారుతున్న యాంత్రిక జీవన విధానం కారణంగా తెలుగు భాష నిరాదరణకు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కవిసాయంత్రం వంటి సాహిత్య సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలతో తెలుగు భాష, సాహిత్యానికి పూర్వవైభవం తిరిగి వస్తుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
జనజాగృతి సంస్థలో అంతర్భాగమైన కవిసాయంత్రం సోషల్ మీడియా గ్రూప్ 11వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పుస్తకాలను ఆవిష్కరించడంతో పాటు కవులు, రచయితలను ఘనంగా సన్మానించారు.
జనజాగృతి సంస్థ అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ రచించిన ప్రశ్నాస్త్రం, ప్రణయ గీతం కవితా సంకలనాలను, బోయిన భాస్కర్ రచించిన గడ్డిపువ్వు కథా సంపుటిని, పొలగాని భాను తేజశ్రీ రచించిన ప్రతినిధి వ్యాస సంకలనాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు కవులు, రచయితలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సామాజిక మాధ్యమాలను సైతం సాహిత్య ప్రచారానికి వేదికగా మలచడం అభినందనీయమని పేర్కొన్నారు.
రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గాజుల శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా కవిసాయంత్రం సోషల్ మీడియా వేదికగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. యువతలో తెలుగు భాషపై ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర, ప్రముఖ కవులు మౌనశ్రీ మల్లిక్, డా. పొన్నాల బాలయ్య, సిరీన్ వ్యాలీ అధినేత మాడ్గుల ప్రభాకర్ రెడ్డి, నూకల అశోక్ యాదవ్, కవులు కవిత బేతి, అత్తలూరి రామకృష్ణ, కడారి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అమెరికా తదితర ప్రాంతాల నుంచి పలువురు కవులు, సాహితీవేత్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





