నిద్రపోతూ హాయిగా సేదతీరుతున్న టీచర్లు
పర్మనెంట్ ఎంప్లాయిస్ ని పక్కన పెట్టి పని కల్పించని డైరెక్టర్
అనర్హులకు అకౌంట్స్ అప్పచెప్పిన
డైరెక్టర్
హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 9: బాల బాలికలకు లలితకళలలో శిక్షణ ఇచ్చే జవహర్ బాలభవన్ సబ్జెక్టు స్కూల్ టీచర్ లకు పునరావాస కేంద్రంలా తయారయ్యింది. నగరం నడిబొడ్డున అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న బాలభవన్ లో ఉపాధ్యాయులు ఇస్టారీతిన
వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు బాల భవన్లు
ఏర్పడ్డాయి. ఆయా రంగాల్లో నియమించబడిన టీచర్లు మాత్రమే వీరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో పనిచేసే సబ్జెక్టు టీచర్లు తమ రాజకీయ పలుకుబడితో అనారోగ్య కారణాలు చూపించి డిప్యుటేషన్పై లలిత కళల్లో అర్హత లేకున్నా వారు బాలభవన్ లో పనిచేస్తున్నారు. మ్యాథ్స్, సైన్సు, సోషల్ పాఠాలు చెప్పే టీచర్లను తీసుకువచ్చి సంగీతం, నాట్యం, చిత్రలేఖనంలలో విద్యార్థులకు బోధిస్తున్నారు. అసలు వారికి లలిత కళల్లో ఏమి చెప్పాలో టీచర్లకు తెలియక ఉదయం నుండి సాయంత్రం వరకు బాలభవన్ లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అటు జిల్లాలో ఉండే విద్యార్థులకు పాఠాలు చెప్పక, ఇటు బాలభవన్లో ఉండే విద్యార్థులకు ఏమి చెప్పాలో తెలియక ఖాళీగా ఉంటూ సేద తీరుతూ కాలక్షేపం చేస్తున్నారు.
ఆఖరుకు బాలభవన్కు విద్యార్థులు రావడమే మానేశారు. ఇవన్నీ బాలభవన్ కు ఇన్చార్జి డైరెక్టర్ గా ఉన్న విజయబాయి ముందే జరగడం గమనార్హం. ఇవన్నీ డైరెక్టర్ కు తెలిసినా మిన్నకుండిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో కూడా రాణించాలని ప్రభుత్వం కృషి చేస్తోంటే స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విద్యాశాఖలోని బాల భవన్లో నిద్రావస్త రాజ్యమేలుతోంది. బాల భవన్ డైరెక్టర్ అసమర్థత వల్ల జిల్లాల్లో ఉండే బాలభవన్ లు పతనావస్థకు చేరాయి. కళాసంస్థ అయినా జవహర్ బాలభవన్ లో స్కూల్ టీచర్ కి ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్ లో డిప్యుటేషన్ పై వచ్చిన టీచర్ వల్ల ఎన్నో తప్పులు జరుగుతున్న డైరెక్టర్ మాత్రం డిప్యుటేషన్ టీచర్కే వత్తాసు పలుకుతూ బాల భవన్ ను అభాసుపాలు చేస్తోంది. ఈ
డైరెక్టర్ అసమర్థత వల్ల
వనపర్తి, మహబూబ్ నగర్ బాలకేంద్రాల భవనాలు ఇతర శాఖల వారు హస్తగతం చేసుకున్న అపవాదు కూడా ఉంది. విద్యార్థులు ఉన్నా టీచర్ లు లేక సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ బాలభవన్ లు ఇప్పటికే మూతపడ్డాయి. ఖమ్మం బాలభవన్ లో డాన్స్ మాస్టర్ గత 4 ఏళ్లుగా రాకున్నా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకపోగా వారికి డైరెక్టర్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ లేకున్నా కూకట్ పల్లి బాలకేంద్రానికి పార్ట్ టైం నుండి ఫుల్ టైం పోస్ట్ ఇవ్వటానికి డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తన
ఇష్టారాజ్యంగా డైరెక్టర్ వ్యవహరిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన రామచంద్ర అనే స్టెనోగ్రాఫర్ తప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చి సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ తీసుకోగా ప్రభుత్వం ఇతడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. తిరిగి అతడిని ఉద్యోగంలోకి తీసుకోవాలనే ఉద్యేశ్యంతో డైరెక్టర్ విజయలక్ష్మిబాయి ప్రయత్నాలు సాగిస్తోందని విశ్వసనీయ సమాచారం. సస్పెండ్ అయిన రాంచందర్ 22 లక్షల వేతనాన్ని తీసుకున్న విషయం కోర్ట్ కి కాని ప్రభుత్వానికి గాని తెలియపరచకుండా అలసత్వం వహించి మళ్లీ ఉద్యోగం లో చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అస్సలు బాలభవన్ కు సంబంధం లేని టీచర్లకు యేండ్లకు యేండ్లు డిప్యుటేషన్ ఇచ్చుకుంటూ డైరెక్టర్ విజయలక్ష్మిబాయి అన్నీ తానై వ్యవహరిస్తుoదన్న విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి. బాలభవన్ కు చెందిన క్యాంటీన్ డబ్బులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఇంచార్జ్ ఆమె సొంత అకౌంట్లో వేయించుకుంటుందని, దీని ద్వారా బాల భవన్ కు రావలసిన ఆదాయానికి గండి పడుతోందని ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆ క్యాంటీన్ ని తీసివేయడం గమనార్హం.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి జవహర్ బాల భవన్ ను ఆకస్మికంగా సందర్శించడంతో పలు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఉపాధ్యాయురాలి సీతా దయాకర్ రెడ్డి ఒక ప్రశ్న వేయగా ఆమె బదులుయిచ్చిన సమాధానంతో ఆశ్చర్యం పోవడం ఆమె వంతు అయింది. ఇంత దారుణమైన పరిస్థితులు బాలభవన్ లో దాపురించాయని సీతా దయాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
ఎస్. విజయలక్ష్మి
(బాలభవన్ డైరెక్టర్)
ప్రియదర్శిని ఆడిటోరియం త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. కళల్లో ప్రావీణ్యం కలిగిన ఉద్యోగులు ఉన్నారు. ఎలాంటి సిబ్బంది కొరత లేదు. ఆరోపణలు అవాస్తవం.







