హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్):
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని ‘జవహర్ సినీ గాన లహరి–సీజన్ 17’ సంగీత కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఉన్న కళా లలితకళా వేదిక ఈ సంగీత విభావరికి వేదికైంది.
గాయకుడు, నిర్వాహకుడు దోళా జవహర్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అలనాటి, నేటి మధురమైన సినీ గీతాలను గాయకులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. సంగీతాభిమానుల కరతాళధ్వనుల మధ్య కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సిటీ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ అంజనీదేవి హాజరయ్యారు. మరో ముఖ్య అతిథిగా కళాకారుడు, స్వరకిన్నెర శారదా పురస్కార గ్రహీత డాక్టర్ త్రినాథరావు పాల్గొన్నారు. మల్లాది ఉష కరావోకే సంగీత సహకారం అందించారు.
సినీ సంగీతం ద్వారా అక్కినేని నాగేశ్వరరావుకు ఘన నివాళి అర్పించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ఈ సంగీత కార్యక్రమంలో కళాకారులు, గాయకులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు.





