రాజులకాలం నుండి టీటీడీ నిర్వహణ వరకు సాగిన అపూర్వ పరిణామం
తిరుపతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 6:
తిరుమలలో బ్రహ్మోత్సవాలంటే... తొమ్మిది రోజుల పాటు సప్తగిరులు భక్తి పారవశ్యంతో మార్మోగే మహోత్సవం. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం–సాయంత్రం వాహన సేవల నుంచి లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ వరకు, నేడు కనిపిస్తున్న ఈ వైభవం ఒక్కరోజులో రూపుదిద్దుకున్నది కాదు. శతాబ్దాలుగా రాజులు, రాణులు, సామంతులు, అధికారులు, భక్తులు అందించిన దానధర్మాలు, ఆలయ పరిపాలనా పరిణామాలు, ఆగమ సంప్రదాయాలు, కాలానుగుణంగా ఏర్పడిన ఉత్సవాలు ఇవన్నీ కలసి నేటి శ్రీవారి బ్రహ్మోత్సవాల రూపాన్ని తీర్చిదిద్దాయి. ఆ చరిత్రకు పురాణాలు మాత్రమే ఆధారం కాదు. తిరుమల ఆలయ గోడలపై చెక్కిన శాసనాలే ఈ ఉత్సవ పరిణామానికి అత్యంత విలువైన చారిత్రక ఆధారాలు. టీటీడీ ప్రచురించిన శాసన సంపుటాలు, చారిత్రక గ్రంథాలు ఈ వైభవానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆవిర్భావానికి పురాణ పరంపరలో ప్రత్యేకమైన కథనం ఉంది. శ్రీనివాసుడు వెంకటాద్రిపై అవతరించిన సందర్భంగా బ్రహ్మదేవుడు తొలిసారిగా ఉత్సవాలను నిర్వహించాడని అందుకే ఈ ఉత్సవానికి ‘బ్రహ్మోత్సవం’ అనే పేరు వచ్చిందని పురాణ ప్రాశస్త్యం.
సామాన్య శకం 966 సంవత్సరం ఒక కీలక మైలురాయి.
పల్లవ రాజవంశానికి చెందిన రాణి సామవై పెరుందేవి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించింది. ఆమె అనేక ఆభరణాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు భూములను కూడా దానం చేసింది. ఆమె దానశాసనం తిరుమల ఆలయ మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై చెక్కబడి ఉంది. ఈ శాసనం ఆధారంగా 10వ శతాబ్దంలోనే బ్రహ్మోత్సవాలు వ్యవస్థీకృతంగా నిర్వహించబడుతున్నట్లు తెలుస్తోంది. పెరటాసి మాసంలో ప్రధాన బ్రహ్మోత్సవంతో పాటు మార్గశిర మాసంలో మరో బ్రహ్మోత్సవం నిర్వహించేందుకు సామవై ఏర్పాట్లు చేసింది. ఆమె దానం చేసిన భోగ శ్రీనివాసమూర్తి ఆలయ ఉత్సవ సంప్రదాయంలో మరో ముఖ్యమైన అధ్యాయానికి నాంది పలికింది.
రెండు ఉత్సవాల నుంచి... ఐదు బ్రహ్మోత్సవాల వరకు
10వ శతాబ్దంలో కనిపించే ఈ సంప్రదాయం అక్కడితో ఆగలేదు. చోళుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య క్రమంగా పెరిగింది. పెరటాసి, మార్గళి తర్వాత పాంగుని బ్రహ్మోత్సవాన్ని యాదవరాయ సామంతుడు వీర నరసింహ యాదవరాయ కాలానికి ఆపాదించారు. 1254లో చోళ రాజు విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం చేరింది. 1300–1330 మధ్య మరో యాదవరాయ సామంతుడి ఆధ్వర్యంలో ఆడి బ్రహ్మోత్సవం ఏర్పడింది. అలా విజయనగర సామ్రాజ్యం ఏర్పడే నాటికి తిరుమలలో సంవత్సరానికి ఐదు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. వాటిలో మూడు చోళుల కాలంలో, రెండు యాదవరాయుల కాలంలో ఏర్పడ్డాయి.
విజయనగర సామ్రాజ్యం... ఉత్సవ వైభవానికి స్వర్ణయుగం
సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు వంశాల కాలంలో ఆలయంలో ఉత్సవాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సంగమ వంశం కాలంలో కొత్త బ్రహ్మోత్సవాలు చేరగా, తరువాత తుళువుల కాలంలో మరిన్ని ఉత్సవాలు ఏర్పడ్డాయి. 15వ శతాబ్దం నాటికి తిరుమలలో సంవత్సరానికి అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి ఈ సంప్రదాయం చేరింది. విజయనగర కాలం చివరి దశకు వచ్చేసరికి శాసనాల్లో సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాల వరకు నమోదయ్యాయి. 1539 నుంచి 1616 మధ్య పది వార్షిక బ్రహ్మోత్సవాల ప్రస్తావనలు శాసనాల్లో కనిపిస్తాయి. అంటే... నేడు సంవత్సరంలో ఒకటి లేదా అధికమాసం వచ్చినప్పుడు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్న విషయం వెనుక, ఒకప్పుడు సంవత్సరానికి అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన సుదీర్ఘ చరిత్ర దాగి ఉంది.1513 ఫిబ్రవరి 10న ఆయన తొలిసారి తిరుమలను దర్శించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. 1513లో తన జన్మమాసమైన తై మాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంటే ఆయన సేవ కేవలం ఆభరణాలు, నిర్మాణాలు, కానుకలకే పరిమితం కాలేదు. శ్రీవారి ఉత్సవ సంప్రదాయాన్ని విస్తరించడంలోనూ ఆయన పాత్ర ఉంది.
అచ్యుతరాయల కాలంలో మరో కొత్త అధ్యాయం
కృష్ణదేవరాయల తరువాత అచ్యుతరాయల కాలంలోనూ ఉత్సవాలకు రాజపోషణ కొనసాగింది. 1533లో కార్తీక బ్రహ్మోత్సవానికి సంబంధించిన తొలి ప్రస్తావన కనిపిస్తుంది. 1534లో ఈ ఉత్సవానికి విరాళం అందించినట్లు ఒక శాసనం చెబుతోంది. అచ్యుతరాయల కాలంలో ఈ ఉత్సవానికి నిరంతరంగా దానాలు అందడం, అది రాజ ప్రోత్సాహంతోనే ఏర్పడినట్లు చరిత్రకారులు భావించడానికి ఆధారంగా నిలుస్తోంది. 1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడటంతో వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య మరోసారి పెరిగింది. ఇది తిరుమల ఉత్సవాల చరిత్రలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. కాలానుగుణంగా కొత్త ఉత్సవాలు చేరుతూ, కొన్ని మారుతూ, మరికొన్ని నిలిచిపోతూ ఒక సజీవ సంప్రదాయంగా అభివృద్ధి చెందింది.
తిరుమల బ్రహ్మోత్సవాల పరిణామంలో మరో కీలక ఘట్టం ఉత్సవమూర్తి మార్పు.
1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామివారు ఉత్సవమూర్తిగా ఉపయోగించబడుతున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారికి వివాహోత్సవాలు, ఇతర ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. నేడు మనం వాహన సేవల్లో దర్శించే శ్రీ మలయప్పస్వామి సంప్రదాయానికి ఇదే చారిత్రక నేపథ్యం.
మహంతుల కాలం నుంచి టీటీడీ వరకు...
19వ శతాబ్దంలో తిరుమల ఆలయ పరిపాలనలో మరో పెద్ద మార్పు వచ్చింది. 1843లో ఆలయ పరిపాలనా బాధ్యతలు హథీరాంజీ మఠాధిపతుల ఆధీనంలోకి వెళ్లాయి. మహంతుల పరిపాలన 1933 వరకు కొనసాగింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడటంతో మహంతుల పరిపాలన ముగిసి, ఆలయాలు కొత్త సంస్థాగత పరిపాలనా వ్యవస్థలోకి వచ్చాయి. ఆ తరువాత శ్రీవారి ఆలయంతో పాటు ఇతర దేవాలయాల ఉత్సవాలను కూడా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థ బలపడింది.
అక్కడి నుంచి బ్రహ్మోత్సవం కేవలం ఆలయ ఉత్సవంగా కాకుండా భక్తుల సౌకర్యం, వసతి, రవాణా, భద్రత, వైద్య సేవలు, అన్నప్రసాదం, సమాచార వ్యవస్థ, ప్రత్యక్ష ప్రసారాలు వంటి అనేక విభాగాలతో కూడిన భారీ సంస్థాగత కార్యక్రమంగా రూపాంతరం చెందింది.






