హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్(సీఎన్సీయూ )లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించారు.
అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ, రిలీఫ్ చర్యలను మంత్రి పరిశీలించారు. ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.
శిశువులు, పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం మానిటర్ చేయాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. పిల్లల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హాస్పిటల్‌లో ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్ష చేస్తున్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఇతర అధికారులు ఉన్నారు.





