హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9 :
పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుక, సామాజిక చైతన్యానికి చిరునామా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు 112 వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... నేటితరం కవులు కాళోజి ఆలోచన ధోరణి ఉనికిపుచ్చుకోవాలని సూచించారు. సమాజంలో సామాజిక పరివర్తన కవులు కళాకారులతోనే సాధ్యమవుతుందని ఆ దిశగా వారు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం కాళోజీ సాహిత్య ప్రక్రియలు ఒక భాగమని కొనియాడారు. ఎవరి వాడుక భాష వారు రాయాలని, బానిస భావన పోవాలనే కాళోజి మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం ప్రముఖ కవి వి ఆర్ విద్యార్థికి కాళోజి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు వెన్నెల గద్దర్, సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు దినకరన్, పల్లె నరసింహ, కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాస రావు, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.






