బీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేసిన భూములను పేద దళితులకు పంచుతాం
: కాంగ్రెస్ నేతలు దీపక్ జాన్, గౌరీ సతీష్ డిమాండ్
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్,18.తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం ధరణి ముసుగులో వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించిందని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భూకబ్జాలపై సమగ్ర విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయిలో సర్వే చేయించి, వాటిని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలా స్వాధీనం చేసుకున్న భూములను పేద దళిత వర్గాలకు పంపిణీ చేయాలని వారు కోరారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఎలాంటి భూమి లేదని పేర్కొన్న కేసీఆర్, ఇంత స్వల్ప వ్యవధిలోనే ఆయన కుటుంబం వందలాది ఎకరాలకు యజమానులుగా ఎలా మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ భూములను తమ పేర్లపైకి మార్చుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో ధరణి పోర్టల్ నుంచి ‘అనుభవదారులు’ అనే కాలమ్‌ను తొలగించి ఎస్సీ, ఎస్టీలను వారి భూములకు దూరం చేశారని మండిపడ్డారు. లక్షలాది మంది ప్రజల భూములు, ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు అంబాసిడర్ కారులో తిరిగిన కల్వకుంట్ల కుటుంబానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు, భూములు ఎక్కడి నుంచి వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కుటుంబం తరతరాలకు సరిపడా ఆస్తులను కూడబెట్టుకుందని, దీనిపై చట్టపరమైన చర్యలు తప్పవని దీపక్ జాన్, గౌరీ సతీష్ లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధులు, పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
----
----





