హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 18: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన టీజీ ట్రాన్స్‌కో ఉద్యోగి మహమ్మద్ ముజాహిద్ కుటుంబానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ. 1 కోటి ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో మృతుడి తల్లి (నామిని)కి ఈ పరిహారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందజేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో జూనియర్ లైన్‌మన్ గా పనిచేస్తున్న మహమ్మద్ ముజాహిద్ (26) 2025 నవంబర్ 5న నైట్ షిఫ్ట్ ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా జరిగినరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీ ట్రాన్స్‌కో ఉద్యోగులకు ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ కింద కల్పిస్తున్న ప్రమాద బీమా పథకంలో భాగంగా బాధితుడి కుటుంబ సభ్యులు 2026 ఫిబ్రవరిలో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శాఖాపరమైన ప్రక్రియ వేగవంతం చేసి, ఆగస్టు 20న రూ. 1 కోటి పరిహారాన్ని మృతుడి తల్లి ఖాతాకు సకాలంలో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.





