నల్గొండకు వెళ్లకుండా మరోసారి బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్..
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడిని ఖండించిన రాంచందర్‌రావు..
తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్ రావును పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు బీజేపీ చీఫ్ నల్గొండ వెళ్లకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు రాం చందర్ రావు ను తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను రాం చందర్ రావు తీవ్రంగా ఖండించారు. వారం రోజుల్లోనే తనను రెండోసారి హౌస్ అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. గతంలో విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న సమయంలో వారిని కలవకుండా తనను అడ్డుకున్నారని, ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వెళ్లకుండా నిరోధించారని పేర్కొన్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థాగతంగా అణచివేస్తుందని రాం చందర్ రావు విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, రాజకీయ దాడులకు గురైన బాధితులకు అండగా నిలవకుండా పోలీసు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఒక చేతిలో రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.







