హైదరాబాద్,ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 5:
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్‌సీసీ గేట్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ.. ‘‘1000 రోజులు.. 1000 దరిద్రాలుగా పాలన సాగుతోంది’’ అని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఊసే లేదని ఆరోపించారు. రాజీవ్ యువ వికాసం అమలు కు నోచుకోలేదన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందడం లేదని, విద్యాదీవెన పథకం హామీగానే మిగిలిందని విమర్శించారు. మహిళా విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీల పంపిణీపై కూడా స్పష్టత లేదన్నారు.
విద్యాశాఖకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కనీసం ఏడు శాతం కూడా కేటాయించడం లేదని దశరథ్ ఆరోపించారు. ‘మాట్లాడితే కేసులు.. కొట్లాడితే జైళ్లు’’ అన్న చందంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని విమర్శించారు.
విద్యార్థుల హక్కులు, యువత భవిష్యత్తు, మహిళా విద్యార్థుల గౌరవం కోసం ప్రశ్నించే గొంతుకగా బీఆర్‌ఎస్‌వీ పోరాటం కొనసాగిస్తుందని దశరథ్ స్పష్టం చేశారు.





