* యశోద ఆసుపత్రిలో వర్షిత్ తల్లిని పరామర్శించిన డా. కె..లక్ష్మణ్..
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 4:
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా. వర్షిత్ రెడ్డి కుటుంబంపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ విభేదాలను దాడులు, బెదిరింపుల రూపంలో వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డా. వర్షిత్ రెడ్డి తల్లిని బీజేపీ ఎంపీ డా. కె. లక్ష్మణ్, సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్, డా. శ్రీరామ్ వెంకటేష్ తదితర నాయకులు పరామర్శించారు. డా. లక్ష్మణ్ ఆమెకు ధైర్యం చెప్పి, కుటుంబానికి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డా. వరశిత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై డా. కె. లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం సరికాదన్నారు. రాజకీయ పోరాటం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరగాలని, దాడులు, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భరత్ గౌడ్ మాట్లాడుతూ డా. వరశిత్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం, కార్యకర్తలు అండగా ఉంటారని తెలిపారు. కష్టకాలంలో ప్రతి బీజేపీ కార్యకర్త కుటుంబం వెంటే పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడు డా. శ్రీరామ్ వెంకటేష్ యశోద ఆసుపత్రిని సందర్శించి డా. వర్షిత్ రెడ్డి తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తన సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపారు.





