- రైతాంగ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిని కొనసాగిస్తాము.
శాసనమండలిలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 9:
యూరియా, ఇతర సబ్సిడీ ఎరువులు నిజమైన రైతులకు పారదర్శకంగా, అవసరమైన మేరకు అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యాప్ అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, భవిష్యత్‌లో రైతులకు మరింత సులభంగా, సమర్థవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు యూరియా సరఫరా, యాప్ ద్వారా బుకింగ్, కౌలు రైతుల ఇబ్బందులు, సొసైటీలకు యూరియా రవాణా చార్జీలు, సాంకేతిక సమస్యలు తదితర అంశాలను ప్రస్తావించారు. వాటిపై మంత్రి సమగ్రంగా వివరణ ఇచ్చారు.
నిజమైన రైతులకే సబ్సిడీ ఎరువులు అందేలా యాప్..
గతంలో ఆధార్ ఆధారంగా ఎరువుల పంపిణీ జరిగేదని మంత్రి తెలిపారు. అయితే సబ్సిడీపై లభించే ఎరువులు భూమిని వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకే అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఎరువుల అక్రమ తరలింపు, బ్లాక్‌మార్కెటింగ్, అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వంటి సమస్యలను అరికట్టడంతో పాటు, రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా చేయడమే యాప్ తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశమని వివరించారు.
పారదర్శకంగా, అవసరమైన మేరకు సబ్సిడీ యూరియా నిజమైన రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రబీ 2025-26లో ‘యూరియా బుకింగ్ యాప్’ను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. తెలంగాణలో అమలు చేసిన ఈ విధానం సత్ఫలితాలను ఇవ్వడంతో దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలను డిజిటల్ విధానంలోకి తీసుకురావడానికి ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్’ను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన యూరియా యాప్ స్థానంలో ప్రస్తుతం ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
యాప్‌లో వచ్చిన సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నాం..
కొత్త యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న సమయంలో అక్కడక్కడా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం వాస్తవమేనని మంత్రి అన్నారు. అయితే అవి వ్యవస్థలో శాశ్వతమైన లోపాలు కావని, సాంకేతిక కారణాలతో ఏర్పడిన సమస్యలని తెలిపారు. భారత ప్రభుత్వం నియమించిన సాంకేతిక బృందం మా అధికారులు యాప్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందన్నారు. రాబోయే పంట కాలాల్లో రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు.
స్మార్ట్‌ఫోన్ లేని రైతులకూ బుకింగ్ సౌకర్యం...
స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు కూడా ఎరువుల బుకింగ్ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. కామన్ సర్వీస్ సెంటర్ల (CSCs) ద్వారా రైతులు ఎరువులు బుక్ చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల డీలర్లు, రిటైల్ ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద ఉన్న వాలంటీర్ల సహకారంతో రైతులకు బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రైతు గుర్తింపు, ఓటీపీ వెరిఫికేషన్‌కు లోబడి ఈ సహాయం అందిస్తారని చెప్పారు.
FFS యాప్ ద్వారా రైతులు సులభంగా ఎరువులు బుక్ చేసుకునేలా ‘మీ-సేవ’ బుకింగ్‌లను కూడా అనుసంధానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు లేదా స్మార్ట్‌ఫోన్ లేని రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెస్తోందన్నారు.
డిజిటల్, భౌతిక స్టాక్‌ల మధ్య తాత్కాలిక వ్యత్యాసాలు...
గిడ్డంగుల నుంచి రిటైల్ విక్రయ కేంద్రాలకు ఎరువులను తరలించడానికి పట్టే సమయం, రసీదుల లెక్కింపు, స్టాక్ బదిలీ నమోదులు, e-POS సింక్రొనైజేషన్, నెట్‌వర్క్ కనెక్టివిటీ వంటి కారణాలతో కొన్ని సందర్భాల్లో డిజిటల్ స్టాక్, భౌతిక స్టాక్ మధ్య తాత్కాలిక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు జిల్లాల వారీగా స్టాక్ తనిఖీలు నిర్వహించాలని, డిజిటల్ రికార్డులు మరియు భౌతిక నిల్వలను క్రమం తప్పకుండా సరిపోల్చాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
గరిష్ట లోడ్‌ను తట్టుకునేలా సర్వర్ సామర్థ్యం పెంపు...
రాబోయే పంట కాలాల్లో రైతుల సంఖ్య పెరిగినా, ఒకేసారి పెద్ద సంఖ్యలో రైతులు యాప్‌ను వినియోగించినా ఎలాంటి సాంకేతిక అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
FFS యాప్ సాంకేతిక బృందం ఎప్పటికప్పుడు లోడ్ టెస్టింగ్ నిర్వహిస్తోందని, అవసరానికి అనుగుణంగా సర్వర్ సామర్థ్యాన్ని ఆటోమేటిక్‌గా పెంచుకునే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. గరిష్ట వినియోగ సమయంలో కూడా రైతులకు సేవలు అందేలా సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
యాప్‌ను రద్దు చేయాలని సభ్యుల విజ్ఞప్తి..
అనంతరం పలువురు సభ్యులు యూరియా రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. కౌలు రైతులు యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో యాప్‌ను రద్దు చేయాలని వారు కోరారు.
యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయం: మంత్రి తుమ్మల...
దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, బ్లాక్‌మార్కెటింగ్‌ను అరికట్టడం, నిజమైన రైతులకు సబ్సిడీ ఎరువులు అందించడం కోసం తీసుకొచ్చిన ఈ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.
యాప్ ద్వారా ఇప్పటికే 50 లక్షలకు పైగా రైతులు ఎరువులు కొనుగోలు చేశారని మంత్రి వెల్లడించారు. ఇంత పెద్ద సంఖ్యలో రైతులు ఈ వ్యవస్థను వినియోగిస్తున్న నేపథ్యంలో, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి వ్యవస్థను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
యూరియా పంపిణీలో పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని సబ్సిడీ ఎరువులను యాప్ ద్వారా విక్రయించే విధంగా ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి తుమ్మల తెలిపారు.
రాష్ట్రంలో మొదట యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన విధానాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విస్తరించి అన్ని సబ్సిడీ ఎరువులకు వర్తింపజేస్తోందన్నారు. రాష్ట్ర యాప్ స్థానంలో కేంద్రం రూపొందించిన FFS యాప్‌ను గత వారమే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేశామని తెలిపారు.
యూరియాను పరిశ్రమలకు తరలించకుండా అరికట్టేందుకే చర్యలు...
గతంలో రైతులకు కేటాయించిన యూరియాను ‘ఇండస్ట్రియల్ యూరియా’ పేరుతో పరిశ్రమలకు తరలించిన సందర్భాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే అవసరానికి మించి కొంతమంది యూరియాను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకునే పరిస్థితులు కూడా ఉండేవని చెప్పారు.
ఇలాంటి అక్రమాలు, దుర్వినియోగం, బ్లాక్‌మార్కెటింగ్ జరగకుండా చూడటంతో పాటు, ప్రభుత్వం అందించే సబ్సిడీ నేరుగా నిజమైన రైతుకు చేరాలనే ఉద్దేశంతో యాప్ విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి స్పష్టం చేశారు.
యూరియాపై రైతుల ఆధారపడే పరిస్థితికి కేంద్ర విధానాలే కారణం...
రైతులు యూరియాపై ఎక్కువగా ఆధారపడటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ ఎరువుల ధరల విధానమేనని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.
యూరియాకు కేంద్ర ప్రభుత్వం అధిక సబ్సిడీ ఇస్తుండగా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ.2,000కు మించి ఉండటంతో రైతులు భూమి ఆరోగ్యాన్ని కాపాడే సమతుల్య ఎరువుల కంటే తక్కువ ధరకు లభించే యూరియా వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
అధికంగా యూరియా వినియోగించడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, దీర్ఘకాలంలో పంటలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడే కాంప్లెక్స్ ఎరువులను సమతుల్యంగా వినియోగించే పరిస్థితి రావాలంటే ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎరువుల ధరలను రేషనలైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో యూరియా తగినంతగా ఉంది...
తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ పరిస్థితుల కారణంగా యూరియా దిగుమతుల్లో కొన్ని అంతరాయాలు ఏర్పడి, అనుకున్న సమయానికి దేశానికి యూరియా చేరుకోని పరిస్థితులు గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎదురయ్యాయని తెలిపారు.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తూ, రాష్ట్రానికి అవసరమైన యూరియాను తెప్పిస్తుందని అన్నారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తూ అవసరమైన సరఫరాలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని చెప్పారు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎరువుల పంపిణీకి సంబంధించి ఒకే విధమైన వ్యవస్థ ఉంటుందని మంత్రి తెలిపారు. ఏ నెలకు ఆ నెలలోని వ్యవసాయ అవసరాలు, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, రైతుల డిమాండ్‌కు అనుగుణంగా ఎరువుల సరఫరా జరుగుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందన్నారు.
గతంలో రాష్ట్రంలో 16 నుంచి 17 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలు ఉండేవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిల్వలను 22 నుంచి 23 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచి, కేంద్రం నుంచి ఎరువులను సమర్థవంతంగా తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు.
డీలర్లు, సొసైటీల వద్ద ధరల్లో వ్యత్యాసాన్ని తొలగించాం...
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల ఎరువుల విక్రయ అవుట్‌లెట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటిలో కేవలం 900 వరకు మాత్రమే సొసైటీలు ఉన్నాయని వివరించారు.
సుమారు 40 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్, రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని పరిస్థితుల్లో రైతుల సౌకర్యం కోసం సొసైటీలకు ఎరువుల రవాణా చార్జీలను ప్రభుత్వం భరించేదని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పారు. అందువల్ల సొసైటీలకు ప్రభుత్వం భరించే రవాణా చార్జీల విధానాన్ని ఉపసంహరించుకున్నామని మంత్రి వివరించారు.
డీలర్ల వద్ద, సొసైటీల వద్ద యూరియా ధరల్లో గతంలో కొంత వ్యత్యాసం ఉండేదని, దీంతో సొసైటీల వద్దే రైతులు ఎక్కువగా యూరియా కొనుగోలు చేసేందుకు వెళ్లడంతో అక్కడ రద్దీ పెరిగి, రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు.
రైతులు ఒకే రకమైన ధరకు ఎక్కడైనా యూరియా కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా రైతులు ఒకే రేటుకు యూరియాను కొనుగోలు చేసుకునే విధంగా నియంత్రించామని మంత్రి స్పష్టం చేశారు. కౌలు రైతులకు కూడా ఎరువుల బుకింగ్ లో ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.





