హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 24:
మల్లెల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 86వ సినీ సంగీత విభావరి గురువారం ఘనంగా ముగిసింది. ప్రముఖ గాయకుడు, పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని ‘ఈ మెడ చుట్టూ గులాబీలురా... ఈ సిగపాయల మందారాలురా...’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పలువురు గాయనీ గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సుమధుర సినీ గీతాలను వినిపించి ప్రేక్షకులను అలరించారు. ఆయన గాన ప్రతిభను, తెలుగు సినీ సంగీతానికి అందించిన విశిష్ట సేవలను వక్తలు స్మరించుకున్నారు.
సంస్థ అధ్యక్షురాలు, గాయని మల్లెల వనంధర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళా, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు. ఆహూతులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆద్యంతం సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.




