న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21: భారత సైన్యం కోసం మెరుగుపరిచిన తక్కువ ఎత్తు లక్ష్యాలను గుర్తించే తేలికపాటి రాడార్లను (ఎల్‌ఎల్‌ఎల్‌ఆర్–ఐ) కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సుమారు రూ.770 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో బుధవారం న్యూఢిల్లీలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ రాడార్ వ్యవస్థ యుద్ధ విమానాల పరిమాణంలోని లక్ష్యాలతోపాటు మినీ, మైక్రో డ్రోన్లను గుర్తించి, వాటి కదలికలను అనుసరించగలదు. గగనతల లక్ష్యాలకు ప్రాధాన్యక్రమం కేటాయించే అదనపు సామర్థ్యం కూడా కలిగి ఉంది. తద్వారా మానవరహిత వైమానిక వ్యవస్థల నుంచి ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు సైన్యానికి తోడ్పడనుంది.
‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టిన ఈ కొనుగోలు గగనతల రక్షణ వ్యవస్థల దేశీయీకరణలో కీలక ముందడుగుగా నిలవనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు దేశీయ రక్షణ తయారీ రంగానికి ప్రోత్సాహం అందించనుంది. స్వావలంబనతో, అంతర్జాతీయంగా పోటీపడగల బలమైన రక్షణ పరిశ్రమ నిర్మాణానికి దోహదపడనుంది.





