హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 28:
సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో, నాగ్‌పూర్‌లోని సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ సహకారంతో 4వ ‘నృత్యనాగ’ కార్యక్రమాన్ని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీలంకకు చెందిన రంగిక నానాయకర, శ్రీ రంగాభి కళా మందిర్ కళాకారులు శ్రీలంక సంప్రదాయ జానపద నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్‌కు చెందిన కళాకారులు నోర్టా, బధాయి జానపద నృత్యాలు, మహారాష్ట్ర కళాకారులు ఢోల్ తాషా ప్రదర్శనలతో అలరించారు. కోల్‌కతాకు చెందిన యాజ్ఞసేని సర్కార్ ఒడిస్సీ నృత్యాన్ని, మౌమితా పాల్ మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి హాజరయ్యారు.
గౌరవ అతిథులుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సుధీర్ ఐఆర్‌టీఎస్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నమోజు బాలాచారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంజనా రాజపక్స మెమోరియల్ అవార్డులు, ‘నృత్యనాగ’ అవార్డులను ప్రముఖులకు ప్రదానం చేశారు.








