సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటల విత్తనాలకు ప్రత్యేక అదనపు బడ్జెట్ కేటాయించాలి
మొక్కజొన్న, జొన్న సహా అన్ని ప్రధాన పంటలకు 100 శాతం కనీస మద్దతు ధర కల్పించాలి
ధరల మద్దతు పథకం కింద 25 శాతం కొనుగోలు పరిమితిని తొలగించాలి
ఎరువుల ధరలు, సబ్సిడీలను హేతుబద్ధీకరించాలి
వ్యవసాయ కూలీలకు ఉపాధి, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17:
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన శనివారం నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా ఈ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని 22 అక్టోబర్ నుండి 30 నవంబర్ వరకు నిర్వహిస్తామని, దీనికి గాను అఖిల భారత వ్యవసాయ సంస్థలు, విశ్వ విద్యాలయాల సిబ్బంది సహకారంతో వీటిని గ్రామాలలో నిర్వహిస్తామని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొంటున్నాయని మంత్రి తెలిపారు. పంటల పరిస్థితిని అంచనా వేయడం, అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించడం, పంటలు కోతకు వచ్చే వరకు వాటిని కాపాడేందుకు అవసరమైన సాగునీరు, విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ సేద్యానికి, మధ్యంతర కాలంలో సాగు చేసే పంటలకు అవసరమైన విత్తనాల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ కేటాయించాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు ఎదురయ్యే నష్టాలను తగ్గించేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఎరువుల ధరలు, సబ్సిడీల అంశాన్ని ప్రస్తావిస్తూ యూరియాపై అధిక సబ్సిడీ కారణంగా ఇతర ఎరువులతో పోలిస్తే దాని ధర తక్కువగా ఉందని, దీనివల్ల యూరియా అధిక వినియోగం పెరిగి నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని మంత్రి తెలిపారు. రైతులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఎరువుల ధరలు, సబ్సిడీలను హేతుబద్ధీకరించి, ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
రైతులు పంటల మార్పిడికి ముందుకు రావాలంటే పండించిన పంటలకు కనీస మద్దతు ధరపై కొనుగోలు భరోసా కల్పించడం అత్యంత ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు సహా అన్ని ప్రధాన పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ )పై 100 శాతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ధరల మద్దతు పథకం (PSS) కింద ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వీబీ –జీ రామ్ జీ పథకం కింద నిధుల కేటాయింపును పెంచడంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పొలాల్లో ఫామ్ పాండ్ల నిర్మాణం, నీటి సంరక్షణ, భూమి అభివృద్ధి పనులను ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడంతో పాటు పండించిన పంటలకు మార్కెట్లో కొనుగోలు భరోసా కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.





