వైద్య, రవాణా, వ్యర్థాల నిర్వహణ సదుపాయాల విస్తరణ
న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17: కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరంలో ప్రాజెక్ట్ సీబర్డ్ రెండో దశ–ఏలో భాగంగా నిర్మించిన పలు మౌలిక వసతులను పశ్చిమ నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ అక్టోబర్ 15న ప్రారంభించారు. కార్యక్రమంలో సీబర్డ్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ వివేక్ దహియా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
భారత నౌకాదళంలో పనిచేస్తున్న రక్షణ పౌర సిబ్బంది కోసం ఐదు టవర్లలో నిర్మించిన 300 నివాస గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్హెచ్ఎస్ పతంజలి ఆసుపత్రి సామర్థ్యాన్ని 409 పడకలకు విస్తరించే కార్యక్రమంలో భాగంగా స్టేషన్ హెల్త్ ఆర్గనైజేషన్ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాలకు అనుబంధంగా రెండు లక్షల లీటర్ల సామర్థ్యంతో కొండపై నిర్మించిన నీటి జలాశయం, మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.
నౌకా స్థావరంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు వరుసల్లో వాహనాల రాకపోకలకు వీలుగా ప్రవేశ ద్వారం, వంతెన మౌలిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. పాదచారులు, సైకిళ్ల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు.
ప్రాజెక్ట్ సీబర్డ్ రెండో దశ–ఏ పరిధిలో సైనిక, పౌర అవసరాలకు ఉపయోగపడే నౌకాదళ వైమానిక స్థావరం, పూర్తిస్థాయి నేవల్ డాక్యార్డు, నౌకలు, విమానాలకు అవసరమైన సరఫరా, నిర్వహణ సదుపాయాల నిర్మాణం కొనసాగుతోంది. సుమారు 10 వేల మంది సైనిక, పౌర సిబ్బంది, వారి కుటుంబాలకు వసతి కల్పించే ఈ స్థావరం ఉత్తర కన్నడ ప్రాంత ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధికి తోడ్పడనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టును చేపడుతున్నారు. పూర్తయిన తర్వాత ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ పొందేలా రూపకల్పన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 90 శాతానికి పైగా నిర్మాణ సామగ్రి, పరికరాలను దేశీయంగా సమకూరుస్తున్నారు.





