Wednesday28 October 2026హైదరాబాద్

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
HYD 22K₹1,32,377/10g+1.04%
भाषाएँ

Latest News

తుఫాన్‌పై అప్రమత్తం.. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ లక్ష్యం! 290 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు.. 84,396 మందికి సురక్షిత ఆశ్రయం

nagendra28 October 2026, 3:13 AM0 व्यूtrinetnews.com
తుఫాన్‌పై అప్రమత్తం.. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ లక్ష్యం! 290 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు.. 84,396 మందికి సురక్షిత ఆశ్రయం

Share this story

Share link keeps your language (?lang=)

శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ప్రభావం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి

అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27: తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ తుఫాన్ సన్నద్ధతపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తుఫాన్ రెడ్ కేటగిరీలో ఉన్నప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుఫాన్ సన్నద్ధతపై నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు భారీ వర్షాలు, బలమైన గాలుల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. కాకినాడ సమీపంలోని యానాం వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయని, రాత్రి నుంచి మరుసటి రోజు వరకు తీరప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

భారీ వర్షాలపై హెచ్చరికలు

కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో 30 సెంటీమీటర్లు, పశ్చిమగోదావరిలో 28 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 23 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వివరించారు. అనేక ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే ప్రమాదం ఉందన్నారు. తీరప్రాంత జిల్లాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చే ప్రమాదం ఉందని, వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. చెరువులకు గండ్లు పడితే వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు సిద్ధం చేశామన్నారు.

84 వేల మందికి సురక్షిత ఆశ్రయం

తుఫాన్ ముప్పును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 290 తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటివరకు 84,396 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. సముద్ర తీర గ్రామాలు, లంకలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తున్నాయని, ప్రతి గంటకు తుఫాన్ హెచ్చరికల బులెటిన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. తుఫాన్ తీవ్రతను అంచనా వేస్తూ కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

మత్స్యకారులు, గర్భిణుల భద్రతకు ప్రత్యేక చర్యలు

సముద్రంలో ఉన్న మత్స్యకారులకు చెందిన 30 వేలకుపైగా బోట్లను వెనక్కి రప్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గోపాల్‌పూర్‌లో ఏపీకి చెందిన 93 బోట్లు, వాటి సిబ్బంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అత్యవసర వైద్య సేవల కోసం 1,316 అంబులెన్సులను సిద్ధం చేశామని, సుమారు 5 వేల మంది గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సమీప ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. తాగునీటి సరఫరాకు ట్యాంకర్లు, జనరేటర్లను సిద్ధం చేశామని, విద్యుత్ అంతరాయాలను వెంటనే పునరుద్ధరించేందుకు 8,400 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని వివరించారు. తుఫాన్ కారణంగా సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి, అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

పంట నష్టంపై అంచనా.. డ్రోన్లతో సహాయక చర్యలు

తుఫాన్ కారణంగా సుమారు 7.16 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలు, 16 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. నష్టాన్ని తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. ముంపు గ్రామాలకు ఆహారం, ఔషధాలు చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలు, బాలింతలకు అవసరమైన సరుకులు అందించడంతో పాటు, రేషన్ సరఫరాకు కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.

గత అనుభవాలతో ముందస్తు కార్యాచరణ

గతంలో బుడమేరు వరదల సమయంలో విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రజలు సుమారు రూ.500 కోట్ల మేర విరాళాలు అందించారని తెలిపారు. ప్రస్తుతం కూడా తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నౌకాదళం, కోస్ట్‌గార్డులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. హుద్‌హుద్ తుఫాన్‌తో పోలిస్తే ప్రస్తుత తుఫాన్ తీవ్రత తక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి:

తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరద నీటి ప్రవాహాల వైపు వెళ్లకూడదు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

यह भी पढ़ें

క్రీడల్లో స్వచ్ఛతకు భారత్‌ కట్టుబడి ఉంది: డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ డోపింగ్‌ ఉల్లంఘనలపై క్రిమినల్‌ నిబంధనలు తీసుకొచ్చేలా జాతీయ యాంటీ డోపింగ్‌ చట్టానికి మరో సవరణ 2025–26లో 7 వేలకు పైగా పరీక్షలు, 350కి పైగా అవగాహన కార్యక్రమాలు: కేంద్ర క్రీడల మంత్రి

క్రీడల్లో స్వచ్ఛతకు భారత్‌ కట్టుబడి ఉంది: డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ డోపింగ్‌ ఉల్లంఘనలపై క్రిమినల్‌ నిబంధనలు తీసుకొచ్చేలా జాతీయ యాంటీ డోపింగ్‌ చట్టానికి మరో సవరణ 2025–26లో 7 వేలకు పైగా పరీక్షలు, 350కి పైగా అవగాహన కార్యక్రమాలు: కేంద్ర క్రీడల మంత్రి

और पढ़ें →