ఆదివారం18 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తాజా వార్తలు

మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ

nagendra18 October 2026, 2:28 AM0 చూసులుtrinetnews.com
మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వ‌చ్చేనెల చివ‌రినాటికి మొద‌టి ద‌శ పూర్తికి స‌న్నాహాలు

మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు

పాలేరు నియోజకవర్గంలో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ

*రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17:

రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్ప‌టికే ఉన్న 411 రోవ‌ర్ల‌కు అద‌నంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని పేర్కొన్నారు. భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సంతృప్తే ప్రాధాన్యంగా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వే పురోగతిపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాల‌కు గానూ తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయిందని వెల్లడించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది అతని జీవనాధారమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత తీసుకురావడంతో పాటు తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు పరిష్కారం చూపడంలో సమగ్ర రీసర్వే కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని, కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉపవిభాగాలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో భూముల అసలు హద్దులపై స్పష్టత కొరవడిందన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర రీసర్వే చేపడుతున్నట్లు వివరించారు.

గతంలో భూముల కొలతలకు ఉపయోగించిన గొలుసులు, కర్రలు, క్రాస్‌స్టాఫ్, మెజరింగ్ టేపుల వంటి సంప్రదాయ పరికరాలకు స్వస్తి పలుకుతూ డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా భూముల కొలతల్లో కచ్చితత్వం పెరగడంతో పాటు సర్వే వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి, భవిష్యత్తులో సరిహద్దులపై వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూరుస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామని, అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని వెల్లడించారు. రోవర్ల వినియోగంతో భూముల సర్వేను వేగంగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు వీలవుతుందని చెప్పారు.

రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపునిచ్చేలా భూదార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. డీజీపీఎస్ ద్వారా సేకరించిన సర్వే సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 2 కోట్ల 29 లక్షలకు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్ నంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.

త్వరలో పాలేరులో భూదార్ పట్టాల పంపిణీ

రీసర్వే ద్వారా ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక సర్వే పటాలు సిద్ధమవుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత పెరగడంతో పాటు భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు వీలవుతుందన్నారు.

తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం కొంగ‌ర గ్రామ ప‌రిధిలో ఉన్న మొత్తం 665 ఎక‌రాల‌లో వంద‌శాతం రీస‌ర్వేను విజ‌య‌వంతంగా పూర్తిచేశామ‌ని త్వరలో భూదార్ పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

భూ రీసర్వేలో అధికారులు తప్పనిసరిగా అనుసరించాల్సిన విధానాలపై మంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు వెళ్లే ముందు సంబంధిత పట్టాదారులకు విధిగా ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించారు. సర్వే నిర్వహించే విషయం భూ యజమానులకు ముందుగానే తెలియజేయడం ద్వారా వారు అందుబాటులో ఉండి తమ భూముల హద్దులను నిర్ధారించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. స‌ర్వేకు ఒక‌టి రెండు రోజుల ముందు ఆయా గ్రామాల్లో త‌ప్ప‌నిస‌రిగా చాటింపు చేయాల‌ని సూచించారు.

అదేవిధంగా, గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు స్పష్టమైన మార్కింగ్ చేయాలని, గ్రామకంఠం హద్దులను నిర్ధారించిన తర్వాతే సర్వే చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, గ్రామకంఠం పరిధుల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో స్పష్టత తీసుకురావాలని సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానుల అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి, పరిశీలించి పరిష్కరించాలని మంత్రి తెలిపారు. సర్వే ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ రీసర్వేను అధికారులు కేవలం ప్రభుత్వ విధిగా భావించకుండా, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక బాధ్యతగా గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి రీసర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. సర్వే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, భూ యజమానులు సంతృప్తి చెందేలా ప్రతి చర్య చేపట్టాలని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా కోణంలోనే ఆలోచించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి