న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:
ప్రస్తుత, భవిష్యత్తు భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా భారత సాయుధ దళాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో మంగళవారం ‘భారత రక్షణ దళాల ఆధునికీకరణ’ అంశంపై నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
మారుతున్న యుద్ధ విధానాలు, కొత్త భద్రతా సవాళ్లు, అధునాతన ఆయుధ వ్యవస్థల సమీకరణ, త్రివిధ దళాల సమన్వయం, స్వదేశీ రక్షణ తయారీపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కృత్రిమ మేధ, స్వయంచాలక వ్యవస్థలు, మానవరహిత వేదికలు, సైబర్, అంతరిక్ష, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికతలను సైనిక సామర్థ్యాలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌ను రికార్డు స్థాయిలో రూ.7.85 లక్షల కోట్లకు పెంచినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఇందులో ఆధునికీకరణ, మూలధన కొనుగోళ్ల కోసం రూ.2.19 లక్షల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. నిధుల సమర్థ వినియోగంతోపాటు దళాల అత్యవసర అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం కీలకమన్నారు.
రక్షణ రంగంలో స్వావలంబన గణనీయంగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. 2014–15లో రూ.46,429 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల విలువ 2025–26లో రూ.1.78 లక్షల కోట్లకు చేరిందన్నారు. 2014లో రూ.2 వేల కోట్లలోపే ఉన్న రక్షణ ఎగుమతులు ప్రస్తుతం సుమారు రూ.40 వేల కోట్లకు పెరిగాయని వివరించారు. 2029 నాటికి రూ.3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులు, రూ.50 వేల కోట్ల ఎగుమతులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
అధునాతన ఆయుధాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో డీఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నుంచి భారీ పరిశ్రమల వరకు ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రక్షణ దళాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారం మరింత పెరగాలని సూచించారు.
సైనిక బలం సాంకేతికత, ఆర్థిక వనరులతోపాటు సిబ్బంది నైపుణ్యం, సన్నద్ధతపై ఆధారపడి ఉంటుందని రాజ్‌నాథ్ అన్నారు. మారుతున్న యుద్ధ అవసరాలకు అనుగుణంగా త్రివిధ దళాలు తమ నిర్మాణాలను మెరుగుపరుచుకుంటున్నాయని చెప్పారు. భారత సైన్యంలో ఏర్పాటు చేసిన ‘అశని’, ‘భైరవ్’, ‘శక్తిబాణ్’ ప్లాటూన్లు సమకాలీన కార్యాచరణ అవసరాలను సమర్థంగా ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
ఆధునికీకరణ అంటే కొత్త ఆయుధాలు కొనుగోలు చేయడమే కాదని, దీర్ఘకాలిక స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం కూడా అని స్పష్టం చేశారు. విదేశీ వనరులపై వ్యూహాత్మక ఆధారపడటాన్ని తగ్గిస్తూ పరిశోధన, ఆవిష్కరణలు, దేశీయ పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు.
సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పలు సూచనలు చేశారు. కీలక సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం, కొనుగోలు–అభివృద్ధి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిర్దేశిత లక్ష్యాల పురోగతిని సమీక్షించడంపై దృష్టి సారించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్, రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్‌తోపాటు ఉన్నత పౌర, సైనిక అధికారులు పాల్గొన్నారు.





