Thursday22 October 2026Hyderabad

SENSEX73,249-1.43%
NIFTY22,688-1.35%
HYD 22K₹1,32,466/10g-2.18%
Languages

Latest News

ముంబైలో రేపటి నుంచి ‘ఇండియా కెమ్–2026’ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

nagendra22 October 2026, 1:52 AM3 viewstrinetnews.com
ముంబైలో రేపటి నుంచి ‘ఇండియా కెమ్–2026’ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

Share this story

Share link keeps your language (?lang=)

భాగస్వామ్య దేశంగా జపాన్.. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు

  • న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:

రసాయన, పెట్రోరసాయన రంగాల్లో భారత పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేలా 14వ ‘ఇండియా కెమ్–2026’ సదస్సు, అంతర్జాతీయ ప్రదర్శన ముంబైలో జరగనుంది. అక్టోబర్ 22 నుంచి 24 వరకు నెస్కోలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జేపీ నడ్డా గురువారం ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ హాజరుకానున్నారు.

కేంద్ర రసాయనాలు, పెట్రోరసాయనాల విభాగం, భారత వాణిజ్య–పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ‘అడ్వాంటేజ్ భారత్: అభివృద్ధి చెందుతున్న ప్రపంచ రసాయన పరిశ్రమల కేంద్రం’ ఇతివృత్తంతో జరిగే సదస్సులో విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఈ ఏడాది జపాన్ భాగస్వామ్య దేశంగా వ్యవహరించనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు, వియత్నాం, కొరియా, ఆసియాన్ దేశాలు సహా 100కు పైగా దేశాల నుంచి భాగస్వామ్యం ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దేశవిదేశాలకు చెందిన 200కు పైగా ప్రదర్శనదారులు, 8 వేల మందికి పైగా వ్యాపార సందర్శకులు పాల్గొనే అవకాశం ఉంది. గ్లోబల్ సీఈవోల ఫోరంలో 50 మందికి పైగా ప్రముఖ సంస్థల సారథులు పాల్గొననున్నారు.

రసాయన ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో, ఆసియాలో నాలుగో స్థానంలో ఉంది. దేశ రసాయన పరిశ్రమ విలువ 2030 నాటికి 300 బిలియన్ అమెరికన్ డాలర్లకు, 2040 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న దేశీయ డిమాండ్, ఎగుమతి అవకాశాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలు ఈ రంగం విస్తరణకు దోహదపడుతున్నాయి.

ప్రదర్శనలో ప్రత్యేక రసాయనాలు, వ్యవసాయ రసాయనాలు, ఎరువులు, ఔషధ తయారీ ముడిపదార్థాలు, రంగులు, నీటి శుద్ధి రసాయనాలు, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. పెట్రోరసాయన విభాగంలో పాలిమర్లు, ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్లు, పునర్వినియోగ ఉత్పత్తులు, వాహన–విమానయాన–ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఉపయోగపడే అధునాతన పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. ఆటోమేషన్, రోబోటిక్స్, కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు, కాలుష్య నియంత్రణ వ్యవస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలు తమ పారిశ్రామిక సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను వివరించనున్నాయి. పెట్రోలియం, రసాయనాలు, పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతాలు, కెమికల్ పార్కుల్లో పెట్టుబడులకు ఈ వేదిక ప్రాధాన్యం ఇవ్వనుంది.

సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సంయుక్త వ్యాపారాలు, పరిశోధన–తయారీ ఒప్పందాలు, హరిత సాంకేతికత, రీసైక్లింగ్, అంకుర సంస్థల అభివృద్ధికి సదస్సు అవకాశాలు కల్పించనుంది. గత 2024 ఎడిషన్‌లో 72 దేశాలు పాల్గొనగా, ఈసారి అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి, ప్రపంచ రసాయన పరిశ్రమలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also read