న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (ట్రైనెట్ న్యూస్):
భారత నౌకాదళానికి చెందిన గైడెడ్ మిసైల్ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్ బ్రిటన్‌లోని ప్లిమత్ చేరుకుంది. బ్రిటన్ రాయల్ నేవీతో కలిసి నిర్వహిస్తున్న ‘కొంకణ్–2026’ ద్వైపాక్షిక సముద్ర విన్యాసాల్లో ఈ నౌక పాల్గొంటోంది.
భారత్–బ్రిటన్ మధ్య ఏటా నిర్వహించే కొంకణ్ విన్యాసాలు ఇరు దేశాల దీర్ఘకాలిక సముద్ర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఈ విన్యాసాల పరిధి, సంక్లిష్టత గణనీయంగా పెరిగాయి. సముద్ర కార్యకలాపాల్లో రెండు నౌకాదళాల మధ్య సమన్వయం, పరస్పర అవగాహనను మెరుగుపరచడంతో పాటు సముద్ర భద్రత సహకారాన్ని బలోపేతం చేస్తున్నాయి.
అక్టోబర్ 8 నుంచి 15 వరకు ప్లిమత్ తీరానికి సమీపంలో రెండు దశల్లో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. నౌకాశ్రయ దశలో వృత్తిపరమైన చర్చలు, పరస్పర నౌకల సందర్శనలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. సందర్శకులకు యుద్ధనౌకను వీక్షించే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
సముద్ర దశలో గగనతలం, సముద్ర ఉపరితలం, నీటి అడుగున జరిగే కార్యకలాపాలకు సంబంధించిన సంక్లిష్ట విన్యాసాలు నిర్వహిస్తారు. ఒక నౌకకు చెందిన హెలికాప్టర్‌ను మరో నౌకపై దించడం, ఆయుధ కాల్పులు, గగనతల రక్షణ సాధన, నౌకల నిర్వహణలో క్లిష్ట విన్యాసాలు, జలాంతర్గాముల నిరోధక సాధన ఇందులో భాగంగా ఉంటాయి.
సురక్షితమైన, స్వేచ్ఛాయుత సముద్రాల కోసం ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ విన్యాసాలు పునరుద్ఘాటిస్తున్నాయి. ‘భారత్–బ్రిటన్ విజన్ 2035’లో పేర్కొన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా ఇవి కొనసాగుతున్నాయి.
ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి ద్వారా క్లిష్టమైన సముద్ర పరిస్థితుల్లో రెండు నౌకాదళాలు సమన్వయంతో పనిచేసే సామర్థ్యాన్ని కొంకణ్–2026 మరింత పెంపొందించనుంది. సముద్ర శాంతి, భద్రత కోసం భారత, బ్రిటన్ నౌకాదళాల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని ఈ విన్యాసాలు ప్రతిబింబిస్తున్నాయి.





