న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 24: డిసెంబర్ 7 నుండి 9 వరకు హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘రక్షా ఎక్స్‌పో 2026’ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జజు గురువారం ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ‘న్యూస్18 డిఫ్‌కాన్ 2026’ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, భారతీయ తయారీదారులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ డెవలపర్లు ఈ ఎక్స్‌పోలో పాల్గొని తెలంగాణలో ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఆహ్వానించారు. ఈ ఎక్స్‌పో ప్రధానంగా వ్యాపార వృద్ధిపై దృష్టి పెట్టనుంది. గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, భారతీయ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ప్రొక్యూర్‌మెంట్ బృందాల మధ్య ప్రత్యేకంగా బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) సమావేశాలు, ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ వేదిక వెండార్ల అభివృద్ధికి, సాంకేతిక భాగస్వామ్యాలకు మరియు భారతీయ సరఫరాదారులను దేశీయ, అంతర్జాతీయ సప్లై చైన్‌లలో అనుసంధానించడానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో తయారీ కేంద్రాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు , ప్రత్యేక ఇంజనీరింగ్ టెస్ట్ బెడ్‌లు, జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు భారతీయ సరఫరాదారులను ఎంపిక చేసుకోవాలని గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించనున్నట్లు స్పష్టం చేశారు. పాల్గొనే కంపెనీలకు, కాబోయే వ్యాపార భాగస్వాములకు మధ్య ముందే నిర్ధారించిన సమావేశాలను ఏర్పాటు చేయడానికి మిలిటరీ అటాచ్‌లు, కౌన్సులర్ ట్రేడ్ ఆఫీసులు కూడా సహకరిస్తాయని వివరించారు. రక్షా ఎక్స్‌పో 2026 లో ప్రత్యేకంగా ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ కాంక్లేవ్, అధునాతన సాంకేతిక ప్రదర్శన, ఎయిర్ షో మరియు లైవ్ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కంపెనీలు తమ డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్, అటానమస్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ల్యాండ్-బేస్డ్ రక్షణ పరికరాలను ప్రదర్శించవచ్చని అన్నారు. వివిధ దేశాలకు చెందిన పెవిలియన్‌లతో పాటు, భారతీయ ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టెక్నాలజీ జోన్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గ్లోబల్ కంపెనీలు తమ సీనియర్ లీడర్‌షిప్, ప్రొక్యూర్‌మెంట్ హెడ్‌లు మరియు సోర్సింగ్ బృందాలను ఈ సమ్మిట్‌కు పంపాలని ప్రధాన కార్యదర్శి ఆహ్వానించారు. ఎగ్జిబిషన్ స్పేస్‌ను బుక్ చేసుకోవాలని, తమ సామర్థ్యాలను ప్రదర్శించాలని, బీ2బీ సెషన్లలో పాల్గొనాలని మరియు పెట్టుబడి దారులు, సోర్సింగ్ భాగస్వామ్యాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ సమ్మిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రసంగంలో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ ఎగుమతులలో సాధించిన 103 శాతం వృద్ధిని, అలాగే వ్యూహాత్మక పరిశోధనా సంస్థలు, డిఫెన్స్ పీఎస్‌యూలు మరియు దాదాపు 1,500 నుండి 2,000 ప్రెసిషన్-ఇంజనీరింగ్ ఎంఎస్‌ఎంఈలతో కూడిన బలమైన పర్యావరణ వ్యవస్థను ప్రధాన కార్యదర్శి హైలైట్ చేశారు. డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్, ఏవియానిక్స్, అధునాతన మెటీరియల్స్, ప్రొపల్షన్, స్పేస్ టెక్నాలజీస్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ రంగాలలో రాష్ట్రం తన సామర్థ్యాలను విస్తరిస్తోందని ఆయన తెలిపారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కు హాజరుకావాల్సిందిగా మరియు రక్షా ఎక్స్‌పో 2026 ను ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏరోస్పేస్ మరియు రక్షణ రంగాలలో సోర్సింగ్ భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారం, పెట్టుబడులు మరియు దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను సులభతరం చేసే ఫలితాధారిత పారిశ్రామిక వేదికగా రక్షా ఎక్స్‌పోను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధాన కార్యదర్శి సంజయ్ జజు పేర్కొన్నారు.





