శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,163/10g+1.53%
భాషలు

తాజా వార్తలు

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ )

సెక్రటేరియట్ లో IRC ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష • కనీవినీ ఎరగని రీతిలో, తెలంగాణ ఖ్యాతి చాటేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు ఆదేశం • 3,000 మంది డెలిగేట్స్, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో, హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు • ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర రాష్ట్రాల మంత్రులు • అతిథుల వసతి, రవాణా, ఆతిథ్యం, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సందర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 25వేల కోట్లతో రాష్ట్రంలో నాణ్యమైన నూతన రోడ్ల నిర్మాణం • రిజనల్ రింగ్ రోడ్డుతో ప్రపంచంలోనే విశ్వనగరంగా హైదరాబాద్.. పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా తెలంగాణ • రూ.12,073 కోట్లతో హైదరాబాద్–విజయవాడ 6+2 లేన్ల జాతీయ రహదారి పనులకు త్వరలో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు - ఐఆర్సీ పై ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

nagendra10 October 2026, 2:25 AM0 చూసులుtrinetnews.com
హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ )

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ ) జాతీయ సదస్సు ఏర్పాట్లపై శుక్రవారం డా.బీ.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఐఆర్సీ సెక్రటరీ జనరల్ రాహుల్ గుప్తా, ఐఆర్సీ డైరెక్టర్ సురేందర్ గర్గ్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, మోర్త్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్,ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముకుంద్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ చీఫ్ ఇంజనీర్లు ధర్మారెడ్డి,వసంత్ నాయక్, బి.వి రావు,నర్సింగరావు పలువురు ఆర్ అండ్ బీ ఇంజనీర్లు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, రవాణా, ఆహారం, ఆతిథ్యం, పర్యాటక ప్రాంతాల సందర్శన తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. రాబోయే గ్లోబల్ సమ్మిట్‌ తరహాలో ఈ జాతీయ సదస్సు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.

IRC విజయవంతం కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ లో నిర్వహించ బోయే ‘‘ఇన్వెస్ట్ తెలంగాణ’’(గ్లోబల్ సమ్మిట్‌)లో పెట్టుబడులను ఆకర్శించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

3,000 మంది ప్రతినిధులు.. 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు*

ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, కార్యదర్శులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఇంజనీర్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి రహదారుల నిపుణులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు కలిపి సుమారు 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని మంత్రి తెలిపారు. హైటెక్స్‌లో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, ఆధునిక సాంకేతికత, భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నిపుణులు ఒకే వేదికపై సమావేశం కావడం వల్ల తెలంగాణకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించడంతో పాటు పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు*

సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం ప్రతి అతిథికి, విమానాశ్రయంలో స్వాగతం పలకడం నుంచి తిరుగు ప్రయాణంలో విమానం ఎక్కించే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా, విభాగాల వారిగా నోడల్ అధికారులను నియమించుకొని పర్యవేక్షణ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్లు, వారికి కేటాయించిన ఇంచార్జి బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రోగ్రాం సక్సెస్ చేయాలని సూచించారు.

*

నాలుగు రోజుల కార్యక్రమాల షెడ్యూల్*

నవంబర్ 19వ తేదీ ఉదయం 11 గంటలకు IRC ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. తాను, రాష్ట్రానికి చెందిన ఇతర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ప్రముఖులు కూడా పాల్గొంటారని చెప్పారు.

ఆ తర్వాత రహదారుల నిర్మాణం, భద్రత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై అంతర్గత చర్చలు, నిపుణులతో గ్రూప్ డిస్కషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఐఐటీ విద్యార్థులు, తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు, రహదారుల రంగ నిపుణులను కూడా ఈ చర్చల్లో భాగస్వాములను చేస్తామని చెప్పారు.

నవంబర్ 19వ తేదీ రాత్రి హైటెక్స్‌లో ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులు, నిపుణులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారని తెలిపారు. నవంబర్ 20న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో చర్చలు కొనసాగుతాయని, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, శాఖాధిపతులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. నవంబర్ 21న ముగింపు కార్యక్రమం నిర్వహించి, గవర్నర్‌ను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. నవంబర్ 22వ తేదీ మధ్యాహ్నం ప్రతినిధుల తిరుగు ప్రయాణాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్రంలో ఐఆర్సీ నిర్వహించాలని తాను వ్యక్తిగతంగా, లేఖ ద్వారా చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం కల్పించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో ఆరు సార్లు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహించగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం ఇది రెండోసారి అని పేర్కొన్నారు. ఇలాంటి జాతీయ స్థాయి కార్యక్రమాలు హైదరాబాద్‌కు రావడం రాష్ట్ర ప్రతిష్టను పెంచడంతో పాటు, తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన గమ్య స్థానంగా నిలుస్తుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయిన తర్వాత హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా ఎదుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో హైదరాబాద్–విజయవాడ 6+2 లేన్ల రహదారి పనులు*

హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం NH-65ను ఆరు ప్రధాన లేన్లు, రెండు సర్వీస్ లేన్లతో విస్తరించేందుకు రూ.12,073 కోట్లతో ఇప్పటికే ఆమోదం లభించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక కమిటీల ప్రక్రియ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ ) కార్యక్రమంలో, గుజరాత్‌లో జరిగిన చింతన్ శివిర్–2026లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరినట్లు వెల్లడించారు. తుది అనుమతులు లభించిన వెంటనే రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనుల ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్ భారీగా పెరిగిందని, అనేక ప్రమాదకర ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్లు ఉన్నాయని చెప్పారు. రహదారి విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రోడ్డు భద్రత మెరుగుపడుతుందని, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని వివరించారు.

RRR ఉత్తర భాగ భూ సేకరణ పూర్తి...

తెలంగాణ అభివృద్ధికి అత్యంత కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్‌పూర్–భువనగిరి–చౌటుప్పల్ మార్గంలో 161.518 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ, భూసేకరణ పూర్తికాకపోవడంతో వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో మరోసారి టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్ ) ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఉత్తర భాగానికి త్వరితగతిన ఆర్థిక, కేంద్ర మంత్రివర్గ ఆమోదాలు లభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు వెల్లడించారు.

హైదరాబాద్ చుట్టూ పూర్తి రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి RRR దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతో సమానంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక పార్కులు, రేడియల్ రోడ్లు తదితర భవిష్యత్ మౌలిక వసతుల అభివృద్ధికి దక్షిణ ఆర్ఆర్ఆర్

కీలకంగా మారుతుందని వివరించారు.

NH-765పై మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్

హైదరాబాద్–శ్రీశైలం NH-765లోని నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోరారు. సుమారు రూ.7,600 కోట్ల అంచనా వ్యయంతో 52 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైందని తెలిపారు.

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రహదారి విస్తరణకు ఎదురవుతున్న సమస్యలకు ఈ ఎలివేటెడ్ కారిడార్ పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడంతో పాటు నల్లమల అటవీ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వివరించారు. ప్రాజెక్టుకు కేంద్ర స్థాయిలో అవసరమైన ఆమోదాలు త్వరగా లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్లోబల్ సమ్మిట్ స్థాయిలో ఐఆర్సీ నిర్వహణ*

ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌ను కేవలం ఒక సమావేశంగా కాకుండా, తెలంగాణ రహదారుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రోడ్డు భద్రత, పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడే వేదికగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణ ఆతిథ్య సంప్రదాయాన్ని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేయాలని, ప్రతి విభాగం బాధ్యతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సదస్సు ద్వారా హైదరాబాద్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని, తెలంగాణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →