సమాచార, ప్రసార శాఖ ప్రత్యేక ప్రచారంతో 40,278 చదరపు అడుగుల స్థలం వినియోగంలోకి
న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06: కార్యాలయాల్లో పరిశుభ్రత, దస్త్రాల నిర్వహణ, పెండింగ్ అంశాల పరిష్కారం లక్ష్యంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రత్యేక ప్రచారం–6.0 విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 2 నుంచి 31 వరకు మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, అనుబంధ మీడియా విభాగాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రచారంలో భాగంగా 1,63,213 కిలోల నిరుపయోగ సామగ్రిని తొలగించి, 40,278 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేశారు. వినియోగానికి పనికిరాని 35 వాహనాలను తొలగింపునకు గుర్తించారు. మొత్తం 1,348 బహిరంగ పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా 1,519 ప్రదేశాలను శుభ్రపరిచారు.
దస్త్రాల నిర్వహణలోనూ పురోగతి సాధించారు. మొత్తం 39,545 భౌతిక దస్త్రాలను సమీక్షించి, అవసరం లేని 8,823 దస్త్రాలను తొలగించారు. అలాగే 12,609 ఈ–ఫైళ్లను పరిశీలించి, 11,199 ఫైళ్లను ముగించారు.
క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు పరిశుభ్రత కార్యక్రమాలు చేరాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సూచించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న కార్యాలయాలకు ప్రాధాన్యమిస్తూ, పరిశుభ్రత చర్యలను ఏడాది పొడవునా కొనసాగించాలని ఆదేశించారు. శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ కార్యక్రమ పురోగతిని నిరంతరం సమీక్షించారు.
గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ ఆకాశవాణి కేంద్రంలో పాత డిష్‌ను భద్రతా సిబ్బంది కూర్చునే ప్రదేశంగా మార్చారు. కొట్టాయంలోని ఐఐఎంసీలో గోడచిత్రాలతో ప్రాంగణాన్ని సుందరీకరించారు. శ్రీనగర్ దూరదర్శన్ కేంద్రం అటవీ శాఖ, సీఆర్పీఎఫ్తో కలిసి శంకరాచార్య కొండపై పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ఇతర ఆకాశవాణి, దూరదర్శన్, పీఐబీ, సీబీసీ కార్యాలయాల్లోనూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.
పరిశుభ్రతను నిత్య ఆచరణగా మార్చడంతో పాటు సమర్థ దస్త్రాల నిర్వహణ, సకాలంలో పెండింగ్ అంశాల పరిష్కారం ద్వారా ప్రజాసేవలను మెరుగుపరచేందుకు ఈ కార్యక్రమం తోడ్పడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.





