గురువారం15 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,782+0.43%
NIFTY22,742+0.98%
22K₹1,36,019/10g-1.07%
భాషలు

తాజా వార్తలు

అక్టోబర్ 15 నుంచి దుర్గాపూజ వేడుకలు బీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా 53వ సార్వజనీన ఉత్సవాలు

nagendra15 October 2026, 2:23 AM0 చూసులుtrinetnews.com
అక్టోబర్ 15 నుంచి దుర్గాపూజ వేడుకలు బీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా 53వ సార్వజనీన ఉత్సవాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ (బీసీఏ) ఆధ్వర్యంలో 53వ సార్వజనీన దుర్గాపూజ వేడుకలను అక్టోబర్ 15 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ పాన్, సహాయ ప్రధాన కార్యదర్శి, ప్రజాసంబంధాలు–మీడియా సమన్వయకర్త డాక్టర్ త్రిషీతా ముఖర్జీ తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయని పేర్కొన్నారు.

బెంగాలీ ప్రజలతోపాటు వివిధ భాషలు, ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజల మధ్య స్నేహభావం, సోదరభావం, ఐక్యతను పెంపొందించడమే వేడుకల ప్రధాన లక్ష్యమన్నారు. ఏటా నిర్వహిస్తున్న దుర్గాపూజ ఉత్సవాలు హైదరాబాద్‌లోని వివిధ వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాయని తెలిపారు.

అక్టోబర్ 16న షష్ఠి పూజతో ప్రధాన ఉత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. అక్టోబర్ 17న మహా సప్తమి, 18న మహా అష్టమి, 19న మహా నవమి పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 20న విజయదశమి వేడుకలు, దుర్గాదేవి నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులకు భోగ్ ప్రసాదం పంపిణీతోపాటు సాయంత్రం హారతి, ధునుచి నృత్యం వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే ‘సింధూర్ ఖేలా’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు.

అక్టోబర్ 15న సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యేక షాపింగ్ ఉత్సవంతోపాటు బెంగాలీ సంప్రదాయ వంటకాలతో ‘ఆనంద్ మేళా’ ప్రారంభమవుతుందని తెలిపారు. బెంగాలీ వంటకాలు, దక్షిణ భారతీయ ఆహార పదార్థాలు, పానీపూరి, చాట్, ఐస్‌క్రీమ్‌లు, చైనీస్ వంటకాలు, బిర్యానీ, బేకరీ ఉత్పత్తులతోపాటు వివిధ వస్తువుల విక్రయ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 17 నుంచి 20 వరకు ఉదయం నిర్వహించే పుష్పాంజలి కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు.

కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు బర్ణాలీ బోస్, ప్రధాన కార్యదర్శి సౌరభ్ బెనర్జీ, సాంస్కృతిక కార్యదర్శి శర్మిలీ బెనర్జీ, కోశాధికారి డాక్టర్ ప్రసెన్‌జిత్ రాయ్, సంయుక్త కోశాధికారి సౌవిక్ ఛటర్జీ, కార్యవర్గ సభ్యులు అనితా దాస్‌గుప్తా, శిబానీ మైతి, సుజాతా పాన్, సౌమ్యరూపా మల్లిక్, బిప్లబ్ ముఖోపాధ్యాయ్, అపర్ణా దాస్‌గుప్తా, రూపా సాహా, బైశాలీ చక్రవర్తి, గౌతమ్ సర్కార్, రంజిత్ పాల్, సంజయ్ బోస్, సుబ్రత మల్లిక్, సిద్ధార్థ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి