ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే మన బలహీనతలను అదుపులో ఉంచుకోలేకపోయినా లేదా వాటిని ఇతరుల ముందు బహిర్గతం చేసినా ,అవి ఎదుటివారి చేతిలో ఆయుధాలుగా మారుతాయి. మనలో లోపాలను తెలుసుకొని ఇతరులు వాటిని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు ఇది నిత్యం మనం చూస్తూనే ఉంటాము. బలహీనత అంటే కేవలం శారీరక దుర్బలత్వం కాదు. దుర్బలత్వం అంటే శరీరం సహకరించకపోవడం కాదు. మన మానసిక స్థితి ,మన ఆలోచనలలో నియంత్రణ లేకపోవడం, అందర్నీ అతిగా నమ్మటం, వారిని నమ్మటమే కాక వారి మెప్పు కోసం ఆరాటపడి ఒక్కోసారి తప్పుదోవ పట్టటం లాంటివి మన జీవితాన్ని కూడా తప్పుదారి పట్టిస్తాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తికి కోపం ఎక్కువ అనుకుందాం. అది గమనించిన ఎదుటివారు కావాలని రెచ్చగొట్టి, తప్పులు చేసేలాగా ప్రేరేపిస్తారు. దీనివల్ల ఆ కోపం తెచ్చుకున్న వ్యక్తికి తీరని నష్టం జరగటమే కాకుండా, తెలియకుండానే తాము ఎవరికి చెప్పుకున్నామో వారికి బలాన్ని చేకూరుస్తారు.
భావోద్వేగాలు అదుపులో లేకుంటే మనుషులు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఎదుటివారిని గుడ్డిగా నమ్మేస్తుంటారు. వారు చెప్పే తీయని మాటలు విని ,వారి వల్ల తమకు జరిగేదంతా మంచి అని అనుకుంటారు. కానీ వారు తమకు అనుకూలంగా వారి మాటలను మార్చుకొని, వారిని తప్పుడువారిగా జనం ముందు నిలబెట్టటమే కాక, తామేదో మహాత్ములైనట్లు
చిత్రీకరించడమే కాక, వారికి తెలియకుండానే వారి గురించి తప్పుడు ప్రచారాలు చేసి, మళ్లీ వాళ్లే కన్నీళ్లు తుడుస్తారు. ఇలాంటి వారు ఈ రోజుల్లో కోకొల్లలు.
కొందరికి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంటుంది .అలాంటి వారిని బాగా ప్రలోభ పెట్టి తేలికగా బురిడీ కొట్టిస్తారు. అలాగే కొంతమంది ప్రేమ కోసం తపించే వారిని తమ స్వార్థం కోసం వాడుకుంటారు.
ఒకచోట ఒక ఉద్యోగి తన పనులను సమయానికి పూర్తి చేయలేకపోవడం లేదా తన ఆలోచనలను స్పష్టంగా చెప్పుకోలేకపోవడం వంటి బలహీనతలను కలిగి ఉంటే, తోటి ఉద్యోగులు దానిని తమ ఎదుగుదలకు మెట్ల లాగా వాడుకుంటారు.
వ్యాపారంలో కూడా చూడండి ఒక సంస్థ యొక్క ఉత్పత్తిలో ఏదైనా లోపం కనబడితే అది అవకాశం గా అందిపుచ్చుకొని ఎదుటివారు వారి అవకాశాన్ని వినియోగించుకొని మార్కెట్ను సొంతం చేసుకుంటారు.
తప్పు అందరూ చేస్తారు. కానీ ప్రతి పని చేసే ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో లేదా మన పనిలో ఉన్న లోపాలు ఏమిటో నిజాయితీగా గుర్తించాలి.
చరిత్ర కూడా చూడండి .ఎన్నో మహా సామ్రాజ్యాలు కుప్పకూలడానికి , గొప్ప గొప్ప యోధులు సులభంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం వారి శత్రువుల బలం కంటే వారి బలహీనతలే అని స్పష్టంగా అర్థమవుతుంది. మన బలహీనతను ఎదుటివారు తెలుసుకున్న మరుక్షణమే మన ఓటమి కూడా మొదలవుతుందని గ్రహించాలి.
పురాణాలలో కూడా చూడండి. ఇలాంటి కథలు ఎన్నో.
కర్ణుడి దాన గుణమే అతని ప్రాణాలకు ముప్పు తెచ్చింది అతని బలహీనతను (అంటే ఏది అడిగినా లేదనకుండా ఇస్తాడు).తెలుసుకున్న ఇంద్రుడు అతడి కవచకుండలాలను దానంగా స్వీకరించి, అతని చావుకు, పాండవుల విజయానికి మార్గం సుగమం(సులువు ) అయ్యేలా చేశాడు.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ విషయాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన మాటలలో చెప్పాలంటే"నీ బలహీనతలను ఎప్పుడూ ఇతరులకు తెలియనివ్వకు ఒకవేళ నీవు పామువు కాకపోయినా పాములా బుస్సు కొట్టడం నేర్చుకో". ఇది చాణక్యుడు చెప్పిన నీతి.
మనలో భయం ఉన్న అది బయటికి కనిపించనీయకూడదు .ఎప్పుడైతే మన భయం ఎదుట వారికి తెలుస్తుందో అప్పుడు వారు మరింత ధైర్యంగా మనపై అధికారం చలాయిస్తారు. నేడు ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మరియు అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా దేశాలు తమ రక్షణ రహస్యాలను, ఆర్థిక లోటుపాట్లను గోప్యంగా ఉంచటానికి ఇదే కారణం.
ఈ రోజుల్లో కొంతమంది తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. కొందరు తమ గురించి తామే గొప్పగా ఊహించుకుంటారు. మొదటి రకం వ్యక్తులు తాము తక్కువని భావించి ,ఇతరుల ఆధిపత్యాన్ని సులువుగా అంగీకరిస్తారు. అతిశయం ,అతి విశ్వాసం ఉన్న వ్యక్తులు తమ లోపాలను గుర్తించలేక నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ నిర్లక్ష్యం ఎదుటివారికి అవకాశాన్ని ఇస్తుంది.
వీటిని అరికట్టాలంటే ప్రతిదానికి తల ఊపటం తగ్గించుకోవాలి. విమర్శలకు కుంగిపోకుండా, తమ తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ ధైర్యమే కవచం లాగా కాపాడుతుంది.
శుభోదయం ....శశి బాల.





