సూర్యాస్తమయం అవుతున్న సమయం. బీచ్ ఒడ్డున అలలను చూస్తూ కూర్చున్న అతని ముఖంలో దిగులు కనిపిస్తుంది. మూడు రోజులుగా సరిగ్గా తిండి తినక, కంటి నిండా నిద్ర లేక పోవడం అతని నీరసంలో తెలుస్తోంది. అటుగా వచ్చిన ఒక చిన్న పాప "అంకుల్, నేను ఆడుకుంటున్న బంతి మీ కాళ్ళ దగ్గర ఆగింది. కాస్త ఆ బంతి నాకు ఇస్తారా?" అని అడిగింది. "సరేనమ్మా, ఇదిగో తీసుకో" అంటూ ఆ బంతిని ఆ పాప చేతికి ఇవ్వబోతుండగా అతని ముఖంలో బాధను గమనించిన ఆ పాప "ఏమైంది అంకుల్, ఏదో బాధలో ఉన్నారు?" అని అడిగింది.
"మూడు సంవత్సరాల పాటు నాతో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, నన్ను పట్టించుకోవడం మానేశారు. తన ఆలోచనలతో ఒంటరితనం నన్ను కమ్మేసింది. ఏం చేయాలో తోచట్లేదు." అని చెప్పాడు.
అప్పుడు ఆ చిన్న పాప "అంకుల్ మూడు సంవత్సరాల క్రితం పరిచయమైన వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు వదిలేసారని మీరు బాధపడుతున్నారు కదా. మరి ఆ మూడు సంవత్సరాల క్రితం మీరు సంతోషంగా లేరా?" అని అడిగింది.
నిజమే కదా. ఆ వ్యక్తి మన జీవితంలోకి రాకముందు మనం సంతోషంగా లేమా? కాలాలు మారుతుంటాయి, రోజులు మారుతుంటాయి, సంవత్సరాలు మారుతుంటాయి, అలాగే మనుషుల ప్రాధాన్యతలు, అభిప్రాయాలు కూడా మారవచ్చు. ఒకప్పుడు మనం వారికి ఒక ముఖ్యమైన వ్యక్తి అయి ఉండవచ్చు, ఇప్పుడు వారి ఆలోచన వల్ల ప్రాధాన్యత మారి ఉండవచ్చు, వారికి ఆ స్వేచ్ఛ ఉంది. వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నిందించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే "వారి ప్రాధాన్య క్రమంలో నీవు లేవు" అనే సత్యం ఇప్పటికైనా నీకు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలపాలి.
ఇలాంటి సందర్భంలో మనం వారితో కలిసి ఉన్న రోజులు, ఆ సంఘటనలు పదేపదే గుర్తుకు వచ్చి, అలాంటి సంతోషకరమైన అనుభూతులు ఇప్పుడు లేకపోవడం వలన బాధగా అనిపిస్తుంది. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేనంతగా ఆలోచనలు అడ్డుపడుతుంటాయి. ఆ వ్యక్తి నిన్ను ఊహించకుండా ఒంటరిగా వదిలేసారు అనే భావన వెంటాడుతుంటుంది.
కానీ ఇలాంటి సమయంలోనే కాస్త సంయమనం పాటించి, ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది.
మనకోసం సమయం కేటాయించలేని వారి కోసమా మనం బాధపడేది? మనం లేకున్నా సంతోషంగా జీవితం గడపగలిగే వారి కోసమా మన సంతోషం త్యాగం చేసేది? మనకోసం కాలువ కూడా దాటలేని వారి కోసమా మనం సముద్రాలు ఈదాలన్నంత ఆతృత పెంచుకునేది?
బంధం ఎక్కువ కాలం నిలబడాలని ఇద్దరి ఆలోచనలో ఉండాలి. ఇద్దరి ప్రయత్నాల్లో ఉండాలి. అది అవతలి వ్యక్తిలో లేనప్పుడు, ఒకరే ఎంతకాలమని ఆ బంధం నిలపాలని ప్రయత్నిస్తారు?
భయపెట్టో లేక బ్రతిమాలో ఇంకొకరిలో ప్రేమ, అభిమానం పుట్టించలేము. స్వేచ్ఛగా రాని ఏ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కాలం గడుస్తున్న కొద్దీ నీలో సంతోషం పెంచలేని ఏ బంధం కోసం పరుగులు తీయకు.
నీ సంతోషాన్ని ఒకరి పాదాల దగ్గరే పెట్టి విలువైన నీ జీవితాన్ని అక్కడే ఆపకు.
ఇలాంటి సమయంలో అవతలి వ్యక్తి మీద మన బాధను కోపంగా మార్చనవసరం లేదు. "ఎవరితో ఉండాలి" అని నిర్ణయించుకునే హక్కు వారికి ఉంది. వారి నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే. అలా అని పదే పదే వారిని గుర్తు చేసుకుంటూ, నిద్రాహారాలు మాని, గతం గుర్తుచేసే ఆలోచనలతో ఉండాల్సిన అవసరం లేదు.
నీటిలో ఉన్నప్పుడు తడవడం సహజం. అలాగే మనల్ని నిర్లక్ష్యం చేసే వారితో ఉన్నప్పుడు బాధ కలగడం సహజం. కానీ ఆ బాధను భరిస్తూ అక్కడే ఉండిపోవడం, వారి కోసమే తపిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే అసలైన పొరపాటు.
సముద్రంలో ఉన్నంతవరకు తడుస్తూనే ఉంటాం. ఒక్కసారి ఒడ్డుకు వస్తే కదా ఆ తడి ఆరడం మొదలయ్యేది.
అలాగే గతం గుర్తుచేసే ఆ ఆలోచనలతోనే ఉంటే ఆ బాధ నుంచి ఎలా బయటపడగలవు?
ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలకు ముందు దూరంగా ఉండాలి.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల దగ్గర కూర్చొని, ఒక్కసారి వారి కష్టాలను విను. నీ క్షేమం కోసం తపించే ఆ రెండు హృదయాలు పడే కష్టం ముందు నీ కష్టం ఏ పాటిదో తెలుస్తుంది. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించే నీ స్నేహితులతో కాస్త సమయం గడుపు. నీకోసం నిలబడే వాళ్ల తపన నీకు అర్థం అవుతుంది.
స్ఫూర్తి నింపే పాటలు, నిన్ను చైతన్యపరిచే సంగీతం విను. కష్టాలకోర్చి ఓపికగా జీవితాన్ని గెలిచిన వ్యక్తుల కథలు తెలుసుకో.
ఉదయాన్నే వాకింగ్ వెళ్లి సూర్యోదయాన్ని చూడు. సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఆస్వాదించు. ప్రతిరోజు క్రికెట్, షటిల్, వాలీబాల్ ఇలా ఏదో ఒక ఆట ఆడటం మొదలుపెట్టు. నీ శరీర దృఢత్వం కోసం వ్యాయామం మొదలుపెట్టు. నీ బరువును అదుపులో ఉంచుకునేలా ఓ ప్రణాళిక పెట్టుకో. నీకు నచ్చిన ఆహారం స్వయంగా నువ్వే వండడం నేర్చుకో. నీ ఉద్యోగంలో లేదా చదువులో మరింత ప్రావీణ్యత కోసం కొత్త నైపుణ్యాలు నేర్చుకో. నీకు స్ఫూర్తినిచ్చే సినిమాలు చూడు. కాసేపు పార్కులో కూర్చో. ప్రకృతిని ఆస్వాదించు. చిన్నపిల్లల ముద్దు మాటలు విను. ఎదుటి వ్యక్తికి చెందిన ఏ ఆలోచనా ఇక నిన్ను నిరుత్సాహపరచలేనంతగా నీ జీవితాన్ని బిజీగా గడుపు.
అలా ఆ ఆలోచనల నుంచి నువ్వు బయటికి రాగలిగితే, ఆ విషయాలు ఏవీ కూడా ఇప్పుడు ఉన్నంతగా నిన్ను భవిష్యత్తులో బాధ పెట్టవు.
నువ్వు సాధించబోయే విజయాలను చూసి నీ తల్లిదండ్రులు, స్నేహితులు నీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి రావాలి. నిన్ను వదులుకున్నందుకు అవతలి వ్యక్తి పశ్చాత్తాపపడేలా నువ్వు ఎదగాలి. అంతేకానీ, ఎప్పుడూ ఒంటరినయ్యాననే భావనతో నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.
చివరిగా ఒక్క మాట: "నువ్వు నాతో ఉంటే బాగుంటుంది" అని అనడానికి "నేను నీతో ఉంటేనే నా జీవితం బాగుంటుంది" అనడానికి చాలా తేడా ఉంది. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు ఆశించినంత మాత్రాన, బాధ పడినంత మాత్రాన ఎదుటి వాళ్ళ దగ్గర లేని ప్రేమ, అభిమానం వాళ్ళు నీకు ఇవ్వలేరు.
ఎవరినో మార్చాలని ప్రయత్నం చేయకు. బ్రతిమాలకు. నీకోసం నిలబడలేని వ్యక్తుల కోసం నీ సమయాన్ని, జీవితాన్ని వృధా చేయకు.
M. Jaya Krishna Reddy
M.S.(Counselling & Psychotherapy)
Motivational Speaker
Cell: 9640 21 55 41





